మా స్థలాలు మాక్కివ్వాల్సిందే.. భూపాల‌ప‌ల్లి జ‌ర్నలిస్టుల నిర‌స‌న‌

by Disha Web Desk 13 |
మా స్థలాలు మాక్కివ్వాల్సిందే.. భూపాల‌ప‌ల్లి జ‌ర్నలిస్టుల నిర‌స‌న‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 45 మంది జర్నలిస్టుల‌కు కేటాయించిన ఫ్లాట్లను ర‌ద్దు చేస్తూ.. కలెక్టర్ భ‌వేష్ మిశ్రా తీసుకున్న నిర్ణయంపై నిర‌స‌న‌లు వ్యక్తమ‌వుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల‌ను ఎలా వెన‌క్కి తీసుకుంటారని పేర్కొంటూ స్థానిక జర్నలిస్టులు గురువారం రిలే నిరాహార దీక్ష ను చేప‌ట్టారు. ఈ నిర‌స‌న దీక్షకు కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి గండ్ర స‌త్యనారాయ‌ణ మ‌ద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప‌లువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. 2013 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 45 మంద‌ది జ‌ర్నలిస్టుల‌కు 80 నుంచి 100 గ‌జాల స్థలాన్ని కేటాయింపు చేసింద‌న్నారు.

చాలా మందికి ఆర్థిక శ‌క్తి లేకుండా ఉండ‌టంతో ఇళ్లను నిర్మించుకోలేక‌పోయామ‌ని చెప్పారు. కాల‌క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించ‌డం, భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ‌టంతో ఇక్కడి స్థలాల‌కు విలువ పెరిగింద‌న్నారు. జ‌ర్నలిస్టుల‌కు ఇచ్చిన స్థలాల‌కు స‌మీపంలోనే కలెక్టర్ కార్యాలయం నిర్మించ‌డంతో త‌మ స్థలాల‌కు విలువ పెరిగింద‌ని ఆనంద‌ప‌డ్డామ‌ని అన్నారు.


అయితే క‌లెక్టరేట్ నిర్మాణ‌మే ఇప్పుడు జ‌ర్నలిస్టుల‌కు ఇచ్చిన స్థలాల‌ను వెన‌క్కి తీసుకునే ప‌రిణామానికి దారితీస్తుంద‌ని ఊహించలేక‌పోయాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి సమీపంలో ఎలాంటి ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుడదని, జ‌ర్నలిస్టుల‌కు ఇచ్చిన అసైన్డ్ ఇళ్ల స్థలాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లుగా కూడా క‌లెక్టర్ ర‌ద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. గతంలో ఇచ్చిన పట్టాలను కొనసాగించాలని, పట్టాల రద్దు కోసం కలెక్టరు ఇచ్చిన నోటీసులను రద్దు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ద్వంద వైఖ‌రి స‌రి కాదు : కాంగ్రెస్ నేత గండ్ర స‌త్యనారాయ‌ణ‌

భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రంలోని జ‌ర్నలిస్టుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖ‌రి అవ‌లంభిస్తోంద‌ని కాంగ్రెస్ నేత గండ్ర స‌త్యనారాయ‌ణ అన్నారు. రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వము జర్నలిస్టుల సంక్షేమంపై పూర్తి నిర్లక్ష్యంతో వ్యవ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. వారికి కేటాయించిన స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టుకునే విధంగా తిరిగి ఉత్తర్వులు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

క‌లెక్టరేట్ సౌక‌ర్యార్థం పేరుతో ఇచ్చిన స్థలాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన స్థలాలను ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పూర్తిస్థాయి మద్దతు తెలుపుతు..దశల వారిగా ఆందోళన పోరాటాలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ప్రభాకర్, నర్సయ్య, శ్రీనివాస్, రమేష్, చెందు, నరేంద్రర్, వంశీ, ఎడ్ల. సంతోష్, రవీందర్, సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవన్, శ్రీనివాస్, పిపాల రాజేందర్, మహేందర్, రజనీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed