'శ్యామల'పై కన్నేసిన రియల్టర్లు.. రాత్రైతే చాలు దొంగచాటుగా..

by Disha Web Desk |
శ్యామలపై కన్నేసిన రియల్టర్లు.. రాత్రైతే చాలు దొంగచాటుగా..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : భీమారంలోని శ్యామ‌ల చెరువును ఖ‌తం చేసేందుకు రియ‌ల్టర్లు ప‌న్నాగం స్పష్టమ‌వుతోంది. ఇప్పటికే చెరువు భూమిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేప‌ట్టిన కొంత‌మంది మ‌రింత‌గా మింగేందుకు పావులు క‌దుపుతున్నారు. చెరువు భూమిని ర‌క్షించాల్సిన ఇరిగేష‌న్ అధికారులే అక్రమార్కుల‌కు, ఆక్రమ‌ణ‌దారుల‌కు అండ‌గా నిల‌బ‌డుతూ త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేస్తున్నట్లుగా విశ్వస‌నీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే చెరువులోని క‌బ్జాల బాగోతం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో ఎఫ్టీఎల్ ప‌రిధిలో మునిగి ఉన్న నిర్మాణాల‌ను ఒడ్డున ప‌డేసేందుకు రియ‌ల్టర్లకు రెవెన్యూ, ఇరిగేష‌న్ అధికారుల స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కుటిల ప‌న్నాగంలో భాగంగానే గురువారం రాత్రి మ‌త్తడిని ధ్వంసం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెళ్లిన అధికారులు స్పందించ‌క‌పోవ‌డం ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. దీంతో పెద్ద మొత్తంలో చెరువులోని నీరంతా దిగువ‌కు వెళ్లిపోతోంది.

రాత్రికి రాత్రే.. మ‌త్తడి ధ్వంసం

హ‌న్మకొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం భీమారంలోని 642 స‌ర్వే నెంబ‌ర్ ప‌రిధిలో ఉన్న చెరువు విస్తీర్ణం 67.22 ఎక‌రాలుగా రికార్డుల్లో ఉంది. వాస్తవికంగా మాత్రం స‌గం వ‌ర‌కు క‌బ్జాకు గుర‌యిన‌ట్లుగా తెలుస్తోంది. మిగిలిన సగం చెరువు భూమిని కూడా మింగేందుకు ప‌న్నాగం వేసిన రియ‌ల్టర్లు క్రమంగా ఎఫ్టీఎల్‌లోకి చొచ్చుకు వ‌స్తున్నారు. చెరువు భూమిలో నిర్మాణాలు చేప‌డుతూ ఎఫ్టీఎల్‌ను చెరిపేస్తున్నారు. ఈ విష‌యంపై ఇటీవ‌ల దిశ స‌మ‌గ్రమైన క‌థ‌నాన్ని ప్రచురించింది. చెరువు ఎఫ్టీఎల్‌ను గుర్తించేలా రీ స‌ర్వే చేప‌ట్టాల‌ని కూడా రెవెన్యూ, ఇరిగేష‌న్ అధికారుల‌ను ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో రీ స‌ర్వే చేప‌డుతామ‌ని ఇరు శాఖ‌ల అధికారులు వెల్లడించారు. క‌లెక్టర్‌కు రీ స‌ర్వేకు ఆదేశించిన రాత్రే మ‌త్తడి రాళ్లను ధ్వంసం చేయ‌డంతో చెరువులోని నీరంతా దిగువకు వెళ్లిపోతోంది. ప‌లు కాల‌నీల్లోల గుండా నీరు పారుతోంది. మ‌త్తడి ధ్వంసం వెనుక రియ‌ల్టర్లు, ఆక్రమ‌ణ‌దారుల హ‌స్తమే ఉన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎఫ్టీఎల్ ప‌రిధిని త‌క్కువ చూప‌డానికి వేసిన ప‌న్నాగ‌మే మ‌త్తడి ధ్వంస‌మ‌ని పేర్కొంటున్నారు.


అంతా ఒక్కట‌య్యారా..?!

చెరువు ఎఫ్టీఎల్ ప‌రిధిలో జ‌రిగిన ఆక్రమ‌ణ‌ల‌పై గ‌తంలో కూడా ఫిర్యాదులు వెళ్లినా ఇరిగేష‌న్‌, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల పెడ‌చెవిన పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఆక్రమ‌ణ‌ల తొల‌గింపులో అధికారుల తాత్సరం ప్రద‌ర్శించ‌డం వెనుక స‌హేత‌క‌మైన కార‌ణాలు లేవ‌న్నది నిర్వివాదాంశం. స‌హ‌జ‌సిద్ధంగా చెరువు ఎఫ్టీఎల్ ప‌రిధి ఎంత వ‌ర‌కు అన్నది తెలిసిపోతుంది. ఎఫ్టీఎల్ ప‌రిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు, ఆక్రమ‌ణ‌ల గుట్టు తెలిసిపోతుంద‌ని ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్ వ‌ర్గాలే పేర్కొంటున్నాయి. అయితే స్థానిక‌ ఇరిగేష‌న్ అధికారుల‌కు నిర్మాణాల తొల‌గింపున‌కు మ‌న‌సు రావ‌డం లేదన్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. అలాగే చెరువులో జ‌రిగిన నిర్మాణాల‌కు సంబంధించిన రిజిస్ట్రేష‌న్లు కూడా జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఎఫ్టీఎల్ ప‌రిధిలోని ప‌ట్టా భూముల్లో రిజిస్ట్రేష‌న్ ఎలా జ‌రిగిన‌ట్లు..? అన్న ప్రశ్నల‌కు స‌మాధానం దొర‌క‌డం లేదు. ఇక ఎఫ్టీఎల్ ప‌రిధిలోని అక్రమ ఇంటి నిర్మాణాల‌కు ఇంటి నెంబ‌ర్లు కేటాయిస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులు వారి ఘ‌న‌త‌ను చాటుకుంటున్నారు. రీ స‌ర్వే మొద‌లు పెడితే చెరువ‌లోని ఆక్రమ‌ణ‌ల‌తో పాటు అధికారుల అక్రమాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈనేప‌థ్యంలో ఎవ‌రికి ఏ ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఎఫ్టీఎల్ ప‌రిధిని త‌క్కువ చేసి చూపడం ఒక్కటే మార్గమ‌ని భావించిన కొంత‌మంది అధికారులు, రియ‌ల్టర్లు మ‌త్తడి ధ్వంసానికి తెగ‌ప‌డిన‌ట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.


Next Story

Most Viewed