ఔట్​సోర్సింగ్​మాయాజాలం!

by Kalyani |
ఔట్​సోర్సింగ్​మాయాజాలం!
X

దిశ, నర్సంపేట : నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో చేపట్టిన ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. 180 ఔట్ సోర్సింగ్ నియామ‌కాలు చేప‌డుతున్నట్లు న‌వోద‌య ఏజెన్సీ వంద‌లాది మంది అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. అదే స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఎలాంటి ర‌శీదులు అంద‌జేయ‌లేదు. డ‌బ్బులిచ్చినవారికే ఔట్ సోర్సింగ్ జాబ్‌లు వ‌స్తాయ‌నే ప్రచారం జ‌ర‌గ‌డంతో ద‌ళారుల ద్వారా పెద్ద మొత్తంలో అభ్యర్థులు డ‌బ్బులు ముట్టజెప్పిన‌ట్లుగా కూడా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ నియామ‌కాల్లో అక్రమాలు జ‌రుగుతున్నట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తడంతో వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్టర్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. అభ్యర్థుల ఎంపిక‌ను పూర్తి పార‌ద‌ర్శకంగా చేప‌ట్టేందుకు వివ‌రాలు తెలియ‌జేశాకే భ‌ర్తీ చేయాలంటూ న‌వోద‌య ఏజెన్సీకి సూచించిన‌ట్లు స‌మాచారం.

అభ్యర్థుల్లో వెల్లువెత్తుతున్న ఆరోపణలివే..

నర్సంపేట పట్టణంలోని నూతన ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవల మొత్తం 29 విభాగాల్లో 180 పోస్టులను తాత్కాలిక పద్ధతిపై భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతను నవోదయ ఏజెన్సీకి అప్పజెప్పారు. ప్రస్తుతం భర్తీ చేస్తామని ప్రకటించిన 180 పోస్టుల్లో దాదాపుగా అమ్ముకున్నారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారిలో తీవ్ర అసంతృప్తి, ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా దరఖాస్తు కోసం ఏజెన్సీ కార్యాలయానికి చేరుకుంటున్న అభ్యర్థుల్లో మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నవోదయ ఏజెన్సీ గతంలో 12 ఔట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మరో 20 పోస్టులను కలిపి మొత్తం 32 పోస్టులను భర్తీ చేయడం వివాదానికి కేంద్ర బిందువైంది. మరోవైపు దరఖాస్తు చేసే వారికి నమోదు చేసుకున్నట్లు ఎలాంటి రసీదు ఇవడంలేదని ప్రచారం జరగడం పలు అనుమానాలకు దారి తీసింది.

నియామ‌కాల‌పై రాని స్పష్టత‌..

వైద్య కళాశాలలో జరుగుతున్న ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీపై పలు ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. 180 పోస్టుల భర్తీకి సంబంధించి టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్ మొదలు డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యార్హతలు ఉన్నాయి. వీటిలో టెక్నికల్ పోస్టుకు రూ.19,500, నాన్ టెక్నికల్ పోస్టులకు రూ. 15,500 వేతనం అందించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిరుద్యోగులు దరఖాస్తులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నారన్న దానిపై నేటికీ సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో పోస్టులను అమ్మకానికి పెట్టారన్న చర్చ బలంగా జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ఒక్కో పోస్టుకు రూ 1.5లక్షల నుంచి రూ. 3లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు బహిరంగ ప్రచారం మొదలైంది. దరఖాస్తుల గడువు ముగియక ముందే పోస్టులన్నీ ముందుగానే అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పారదర్శకత పాటిస్తున్నాం..కుమార్, నవోదయ ఏజెన్సీ నిర్వాహకుడు

వైద్య కళాశాలలో చేపడుతున్న పోస్టుల భర్తీకి సంబంధించి పారదర్శకత పాటిస్తున్నాం. గతంలో 12 ఔట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాల మేరకు 180 పోస్టులకు నియామక ప్రక్రియ మొదలు పెట్టాం. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాం. కలెక్టర్ ఆదేశాలతోనే దరఖాస్తుదారుల జాబితా కలెక్టర్ కార్యాలయంలో అందజేశాం. కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల కమిటీ పోస్టుల భర్తీ చేపడతుంది. నవోదయ ఏజెన్సీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు.

మెరిట్ అభ్యర్థులకు అవకాశం

వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ బాధ్యత నవోదయ ఏజెన్సీ ది మాత్రమే. నియామక ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్, నవోదయ ఏజెన్సీ పనులు పూర్తి చేస్తారు. 180 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం తక్కువ మొత్తంలో భర్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మిగతా పోస్టులు భర్తీ చేస్తారు.

–మోహన్ దాస్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్



Next Story