గ్రామానికి రోడ్డు వెయ్యమన్నందుకు.. ఖాళీ చేయమంటున్న అధికారులు

by Disha Web Desk 12 |
గ్రామానికి రోడ్డు వెయ్యమన్నందుకు.. ఖాళీ చేయమంటున్న అధికారులు
X

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామ పంచాయతీ శివారులోని దొరవారి తిమ్మాపురం గ్రామం పూర్తిగా అటవీ ప్రదేశంతో కూడుకున్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటే కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. గ్రామం నుండి నిత్యావసర వస్తువులు సరుకులు తీసుకోవడం కోసం రావాలంటే వాగులు వంకలు దాటాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయినట్టే.

కలెక్టర్‌ను కలిసి గ్రామానికి రోడ్డు వేయాలని వినతి..

గతం లో దొరవారి తిమ్మాపురం గ్రామ ప్రజలు అందరూ కలిసి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారి వద్దకు వెళ్లి మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ను కోరారు. వారి సమస్యను విన్న కలెక్టర్ వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలని గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పలుమార్లు ఆ గ్రామాన్ని సందర్శించిన మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు సమస్యలు తెలుసుకొని కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది.

కలెక్టర్ ఆదేశాలతో దొరవారి తిమ్మాపురం గ్రామ ప్రజలను వెంటనే ఆ గ్రామాన్ని ఖాళీ చేయించాలని, వారికి వేరే చోట పునరావసం ప్రభుత్వం తరఫున కల్పిస్తామని అన్ని సదుపాయాలు కల్పిస్తామని.. అధికారులు గ్రామ ప్రజలకు పలుమార్లు ఆ గ్రామానికి వెళ్లి వివరించారు. కానీ గ్రామస్తులు మాత్రం అధికారుల నిర్ణయాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. మా తాత తండ్రుల నుండి ఇదే అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం.

ఈ ప్రాంతంతో మాకు ఉన్న అనుబంధం అలాంటిది. ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. అధికారులు మాత్రం గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారని.. గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి రోడ్డు వేయమన్న పాపానికి మా గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారని గ్రామస్తులు అన్నారు.


Next Story