దిశ ఎఫెక్ట్ : చెరువు స్వాహా అనే కథనానికి స్పందించిన అధికారులు

by Disha Web Desk 5 |
దిశ ఎఫెక్ట్ : చెరువు స్వాహా అనే కథనానికి స్పందించిన అధికారులు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : హ‌న్మకొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌ల ప‌రిధిలోని భీమారం చెరువుకు హ‌ద్దులు ఏర్పాటు చేయాల‌ని క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతు ఇరిగేష‌న్ అధికారుల‌ను ఆదేశించారు. భీమారం చెరువులో ఆక్రమ‌ణ‌లు, అక్రమ నిర్మాణాల‌పై దిశ గురువారం చెరువు స్వాహా అనే శీర్షిక‌తో ప్రముఖంగా క‌థ‌నం ప్రచురించింది. దిశ క‌థ‌నానికి స్పందించిన క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతు వెంట‌నే చెరువు ఎఫ్టీఎల్‌ను గుర్తించేందుకు వీలుగా రెవెన్యూ, ఇరిగేష‌న్ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ స‌ర్వే చేప‌ట్టాల‌ని ఇరు శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. సాధ్యమైనంత త్వర‌లోనే స‌ర్వే పూర్తి చేసి హ‌ద్దులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఇదే విష‌యంపై దిశ ప్రతినిధి హ‌స‌న్‌ప‌ర్తి త‌హ‌సీల్దార్ నాగేశ్వర్‌రావును వివ‌ర‌ణ కోర‌గా ఎఫ్టీఎల్ ప‌రిధిలోని వీఆర్ ఏలు స‌మ్మెలో ఉన్నందున సిబ్బంది త‌క్కువ‌గాఉన్నార‌ని, సాధ్యమైనంత త్వర‌గా ఇరిగేష‌న్ అధికారుల‌తో క‌ల‌సి స‌ర్వే చేప‌డుతామ‌ని వెల్లడించారు. ఇరిగేష‌న్ డీఈ రాజుతో మాట్లాడ‌గా క‌లెక్టర్ నుంచి వ‌చ్చిన ఆదేశాల‌ను ధ్రువీక‌రించారు. ఇరిగేష‌న్ అధికారుల‌తో క‌ల‌సి స‌ర్వేను మొద‌లుపెడుతామ‌ని తెలిపారు. స‌ర్వే అనంత‌రం నివేదిక‌ల‌ను ఉన్నతాధికారుల‌కు పంపిస్తామ‌ని వారిచ్చే ఆదేశాల‌కు అనుగుణంగా హ‌ద్దుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అయితే ఎఫ్టీఎల్ ప‌రిధిలో ప‌ట్టా భూముల‌ని చెప్పి చేప‌ట్టిన నిర్మాణాలను ఎట్టి ప‌రిస్థితుల్లో తొల‌గిస్తామ‌ని కూడా వెల్లడించారు. గూగుల్ మ్యాపు ద్వారా ఇప్పటికే కొంత స్పష్టత వ‌స్తోంద‌ని, స‌ర్వే ద్వారా ఆక్రమ‌ణ‌ల విష‌యం తేలిపోతుంద‌ని స్పష్టం చేశారు.
చ‌ర్చనీయాంశ‌మైన చెరువు స్వాహా క‌థ‌నం..

హ‌న్మకొండ ప‌ట్టణంలో అంత‌ర్భాగంగా ఉన్న భీమారం చెరువు ఆక్రమ‌ణ‌ల‌పై దిశ ప్రచురించిన క‌థ‌నం సంచ‌ల‌నం సృష్టించింది. ఆక్రమ‌ణ‌ల వెనుక కొంత‌మంది ప్రజాప్రతినిధుల ప్రొద్బలం ఉంద‌న్న ఆరోప‌న‌లు వినిపిస్తున్న‌నేప‌థ్యంలో దిశ క‌థ‌నంపై అధికార‌, రాజకీయ వ‌ర్గాల్లో, ప్రజ‌ల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. అయితే స్వయంగా క‌లెక్టర్ స్పందించి విచార‌ణ‌కు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. అయితే విచార‌ణ‌లో స‌క్రమంగా సాగుతుందా..? చ చెరువులోని ఆక్రమ‌ణ‌లు, అక్రమాలు బ‌య‌ట‌ప‌డ‌తాయా..? అన్నది వేచి చూడాలి.


Next Story