నిధుల పంపకాల తేడాతోనే జడ్పీ సర్వసభ్య సమావేశం బహిష్కరణ : MLA Seethakka

by Disha Web Desk 13 |
నిధుల పంపకాల తేడాతోనే జడ్పీ సర్వసభ్య సమావేశం బహిష్కరణ : MLA Seethakka
X

దిశ, మహబూబాబాద్ టౌన్: జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. జిల్లా పరిషత్ ఆఫీసుకు జడ్పీటీసీ లందరూ హాజరైనప్పటికీ సమావేశ మందిరానికి రాకపోవడంతో వారిని బుజ్జగించేందుకు మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ.. వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఏ మాత్రం వినకుండా అందరూ మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించారు.

జడ్పీ చైర్మన్.. జడ్పీ నిధులను తనకు ఇష్టం వచ్చినట్లుగా జడ్పీటీసీ లకు కేటాయించకుండా కేవలం తన మండలానికి మొత్తం నిధులను కేటాయిస్తూ తమకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. కేటాయింపులో భాగంగా 60 శాతం నిధులను కేవలం బయ్యారం మండలానికి ఖర్చు చేసినట్లు జడ్పీటీసీలు తెలిపారు. అంతేకాకుండా తమకు కేటాయించాల్సిన 40 శాతం నిధులను కూడా తమకు కేటాయించట్లేదని, పక్షపాత వైఖరితో 60 శాతం నిధులు బయ్యారం ఒక్క మండలానికి కేటాయించడం వల్ల.. మిగతా మండలాల జడ్పీటీసీలు నిధులు లేక తమ మండలాల్లో ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని అందువల్లనే సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నామని తెలిపారు.


సర్వసభ్య సమావేశానికి అధికారులంతా హాజరైనప్పటికీ అధికార పార్టీ జడ్పీటీసీ లు సభ్యులే ఈ విధంగా బహిష్కరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఈ జిల్లాలో మా నియోజకవర్గానికి సంబంధించిన రెండు జడ్పీటీసీలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడం వల్ల వాటి అభివృద్ధి కోసం నిధులు కేటాయించమని అడగడానికి దూర ప్రాంతం నుంచి సమావేశానికి వస్తే, ఇక్కడ అధికార పార్టీ జడ్పీటీసీ ల, చైర్మన్ మధ్య పంపకాలలో తేడాలు రావడం వల్ల వారికి వారే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇలా సమావేశాన్ని బహిష్కరించడం ఏ మాత్రం సరికాదని అన్నారు.

ఏదైనా నిధులకు సంబంధించిన వ్యవహారం ఉంటే సమావేశానికి ముందే అంతర్గతంగా చర్చించుకుని ఉంటే బాగుండేది అని సమయం వృధా కాకుండా ఉండేదని ఆమె ఆరోపించారు. త్వరలోనే మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశానికి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, వివిధ శాఖల అధికారులు జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు హాజరయ్యారు.



Next Story

Most Viewed