చిన్న జాతరపై చిన్న చూపు

by Dishafeatures2 |
చిన్న జాతరపై చిన్న చూపు
X

దిశ, ములుగు ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలవబడుతున్న మేడారం సమ్మక్క- సార్లమ్మ జాతర సంవత్సరానికి ఒకసారి మినీ జాతర పేరుతో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుండి 4 వరకు జరిగే మినీ జాతరకి వివిధ రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా తో మినీ జాతరకి భక్తుల సౌకర్యార్థం నిధులు విడుదల చేసి, అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో మినీ జాతర నిర్వహిస్తున్న ఆలయ పరిసర ప్రాంతాల్లో జాతర హంగులు, గుడి కి అలంకరణ, గద్దెల ప్రాంతంలో చలువ పందిర్లు లాంటివి ఏర్పాటు చేయకపోవడం, జాతర నిర్వహిస్తున్నట్టు ప్రచారాలు గాని, జాతరకు ఆర్భాటాలు కానీ లేకుండా ఇలా సాదాసీదాగా మినీ జాతర నిర్వహిస్తున్నారు. మినీ జాతరకు ముందస్తుగా వచ్చే భక్తులకు సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లు ఖర్చుపెట్టిన భక్తులకు సరైన వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నారని అపవాదు ప్రతి జాతరకి ఉన్న ఈసారి కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైనట్టే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


తాగునీరు, మరుగుదొడ్లకు ఇక్కట్లు

మినీ జాతర 2023 కు ఇంకా రెండు రోజులే సమయం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లో కానీ జంపన్న వాగు చుట్టుపక్కలో కానీ భక్తులు విడిది చేసే ఆవరణలో మంచినీటి అవసరాల కోసం కులాయిలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కానీ మినీ జాతర ఏర్పాట్లలో మంచినీటి అవసరాల కోసం నల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో జాతరకు వచ్చే భక్తులకు ఈసారి మంచినీటి కోసం ఇక్కట్లు తప్పేలా లేవు. ఇక మరుగుదొడ్ల విషయానికొస్తే శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసిన మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం ఒక ఎట్టయితే తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు ఇంకా మొదలు కాకపోవటం ఒక ఎత్తు. జాతర సమయానికి తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోతే సామాన్య భక్తులకు, సుదూర ప్రాంతం నుండి బస చేయటానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వచ్చే భక్తులు మంచినీటి అవసరాల కోసం పంట పొలాల్లోని బోరుల వద్దకు నీటి కోసం వెళ్తుండడం గమనార్ధం.


ముందస్తు భక్తులకు తప్పని తిప్పలు

ఫిబ్రవరిలో జరిగే మినీ జాతరకి ఇప్పటికే భక్తుల తాకడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది జాతరకి వచ్చే ముందస్తు భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికార యంత్రాంగం విఫలమైనట్టే భావిస్తున్నారు. రోజు వేల సంఖ్యలో వచ్చే భక్తులు జంపన్న వాగు లో నీటిమట్టం సరిగా లేక స్నానానికి కుళాయిలను ఆశ్రయిస్తున్నప్పటికీ అవి తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల భక్తులు స్నానానికి వేచి చూడవలసి వస్తుంది. భక్తులు తీసుకువచ్చే వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేక గుడి పరిసర ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్టు వాహనాలు నిలపడంతో మిగతా వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక పారిశుద్ధం విషయంలో సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్టు భక్తులు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మేడారంలో వీధి వ్యాపారుల దోపిడీ

మినీ మేడారానికి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి వస్తున్న సమయంలో వీధి వ్యాపారుల దోపిడి ఎక్కువగా ఉందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరాణం షాపులు, పౌల్ట్రీ షాపులు, కూల్ డ్రింక్ షాపులలో ఉన్నదరకి 20 నుండి 50 రూపాయల వరకు ఎక్కువగా అమ్ముతూ రేట్లను అమాంతం పెంచి భక్తుల దగ్గర నుండి భారీగా దండుకుంటున్నట్టు, ఇక కొలతల విషయంలో సైతం భారీ వ్యత్యాసం వచ్చేలా చేసి దోపిడీకి పాల్పడుతున్నట్టు భక్తులు వీధి వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు కలగచేసుకుని సంబంధిత షాప్ లో తనిఖీలు నిర్వహించి దోపిడీని అరికట్టాలని విన్నవించుకుంటున్నారు.



Next Story

Most Viewed