- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి వన జాతర..

దిశ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. ములుగు జిల్లాలో జరిగే మేడారం మహా జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తుంటారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో నిర్వహించే మహా జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క- సారలమ్మను పూజించేందుకు కోట్లాది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రెండేళ్లకొకసారి నిర్వహించే మేడారం మహాజాతర మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తూ ఉంటారు. 2024లో మేడారం మహా జాతర పూర్తవడంతో ఈ యేడు నేటి నుంచి 15వ తేదీ వరకు మినీ జాతర జరగనున్నది. ఈ నేపథ్యంలో నేటి జాతర ఘట్టం మొదలుకానుంది. నాలుగు రోజులు సమ్మక్క పుట్టిన గ్రామమైన బయ్యక్కపేటలో జాతర నిర్వహించడంతో పాటు ఏటూరునాగారం మండలం ఐలాపూర్ గ్రామంలోనూ గోవిందరావుపేట మండలంలోని ఫ్రూట్ పారంలో లోను సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తారు.
నేటితో జాతర షురూ..
రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు భిన్నంగా మినీ జాతర జరుగుతుంది. సమ్మక్క సారలమ్మల పూజారులు అమ్మవార్ల గద్దెలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లను కొలిచే పండుగను మినీ జాతరగా పేర్కొంటారు. బుధవారం సారలమ్మ పండుగ నేపథ్యంలో కొండాయిలోని గోవిందరాజులు గుడిలో, పూనుగొండ్లలోని పగిడిద్దరాజుల గుడితో పాటు కన్నెపెల్లిలోని సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారులు మేడారం ఆలయానికి చేరుకొని సారలమ్మ గద్దెను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు చేస్తూ అక్కడే జాగారం చేసి అమ్మవార్లను కొలుస్తారు. నేడు సారలమ్మ అమ్మవారి గద్దె చేరుకోగా, 13న సమ్మక్క గద్దె శుద్ధిచేసి సమ్మక్క- సారలమ్మకు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. శుక్రవారం, శనివారం మొక్కులు చెల్లించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. నాలుగు రోజుల మినీ జాతర ఘట్టం నేటి నుంచి మొదలు కానుంది.
20 లక్షలకు పైగా హాజరు కానున్న భక్తులు..
మేడారంలో మినీ జాతర నాలుగు రోజుల్లో 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరా, 24 గంటల వైద్య సేవలు, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు, మేడారం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ, శాంతి భద్రతలపై పోలీస్ శాఖ దృష్టి సారించారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు హనుమకొండ బస్టాండ్ నుంచి నిరంతరం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
జంపన్న వాగులో కనిపించని నీటి జాడ..
మినీ జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.5.30కోట్ల నిధులతో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యచరణ నిర్వహించగా సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంచినీరు, మరుగుదొడ్ల విషయంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోతున్నారు. జంపన్న వాగులో స్నానం ఆచరించడానికి నీరు లేకపోవడంతో ఇరువైపులా ఏర్పాటు చేసిన నాలాల కిందనే స్నానం చేయాల్సి వస్తుందని మండిపడుతున్నారు. జాతర సమయంలో కూడా జంపన్న వాగులోకి నీరు విడుదల చేయకపోవడం పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జాతరకు ఏర్పాట్లు పూర్తి.. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర..
నేటి నుంచి ప్రారంభం కానున్న మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. పక్షం రోజుల నుంచి పారిశుధ్య పనులను చేపట్టారని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడానికి నల్లాలు ఏర్పాటు చేయడం, మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారన్నారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి, ఐలాపూర్ గ్రామాల్లో జరుగనున్న మినీమేడారం జాతరకు సైతం ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు రోడ్డు రవాణా సంస్థ చిన్న బోయినపల్లి గ్రామం నుంచి కొండాయి వరకు, తాడ్వాయి, ఊరటం గ్రామాల నుంచి కొండాయి వరకు భక్తులను తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని సంతోషంగా తమ గ్రామాలకు చేరుకోవాలని కలెక్టర్కోరారు.
మేడారం జాతరకు పటిష్ట భద్రత.. సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ములుగు జిల్లా ఎస్పీ శబరీష్..
ములుగు జిల్లాలో నేటి నుంచి జరగబోయే మినీ మేడారం జాతర సందర్భంగా పోలీసు డిపార్ట్మెంట్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం మేడారంలో బందోబస్తు కోసం వచ్చిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆఫీసర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు దాదాపు వెయ్యి మందికి మినీ మేడారం లో బందోబస్తు కోసం కేటాయించడం జరిగిందని, బందోబస్తు కోసం ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల నుంచి సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. బందోబస్తులో ముఖ్యంగా నాలుగు అంశాల పై దృష్టి సారించినట్టు తెలిపారు.
ట్రాఫిక్ కంట్రోల్ లో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం డైవర్షన్ పాయింట్లు, పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి రోడ్లమీద పార్కింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా బైక్ పెట్రోలింగ్ పార్టీలను, డ్రోన్ల ద్వారా, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారని తెలిపారు. క్యూలైన్లలో, గద్దెల వద్ద బందోబస్తు చేసే సిబ్బంది భక్తులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. క్రైమ్ స్టాప్ గద్దెల వద్ద, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో అలాగే క్యూలైన్లలో మఫ్టీలో తమ విధులు నిర్వహిస్తూ ఉంటారని, ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిత్యం పహారా కాస్తు ఉంటారని, మినీ మేడారం జాతర సందర్భంగా వీవీఐపీలు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.