కాలుతున్న చెత్తను ఆర్పివేసేందుకు చర్యలు: బల్దియా కమిషనర్‌

by Dishaweb |
కాలుతున్న చెత్తను ఆర్పివేసేందుకు చర్యలు: బల్దియా కమిషనర్‌
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : తీవ్రమైన వేసవి వల్ల కాలుతున్న చెత్తను ఆర్పుటకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా పరిధి 45వ డివిజన్‌ రాంపూర్‌ డంపింగ్‌ యార్డ్‌లో తీవ్రమైన ఎండకు కాలుతున్న చెత్తను పరిశీలించి, చెత్త ఆర్పుటకు తక్షణమే ఫైర్‌ ఇంజన్‌తో పాటు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బయో మైనింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న పని తీరును పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయుటకు పలు సూచనలు చేశారు. బయో మైనింగ్‌ ద్వారా చెత్తా నిర్వీర్యం చేస్తున్న తీరును కంప్యూటర్‌లో పరిశీలించారు. డంప్‌ యార్డ్‌లో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు లక్షన్నర మెట్రిక్‌ టన్నుల చెత్త నిర్వీర్యం చేయడం జరిగిందని, లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జులై నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ప్రతిరోజు 1600 మెట్రిక్‌ టన్నుల చెత్త ప్రాసెసింగ్‌ జరుగుతున్నదని, షిఫ్ట్‌ లను, మెన్‌ అండ్‌ మెటీరియల్‌ పెంచి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చెత్త బయో మైనింగ్‌ నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండ కనీస ప్రమాణాలు పాటించాలని అన్నారు. వెలుబడిన అంత్య ఉత్పన్నాలను, ఆర్‌ డిఎఫ్‌ లను సిమెంట్‌ ఫ్యాక్టరీ లకు పంపడంతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా పొలాల్లో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కమిషనర్‌ వెంట సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేష్‌, ఆర్‌ఎఫ్‌ఓ పాపయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌ రెడ్డి, డిఎఫ్‌ఓ శంకర్‌లింగం, ఈఈ సంజయ్‌, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed