పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా భారీ నిరసన

by Dishanational2 |
పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా భారీ నిరసన
X

దిశ, హనుమకొండ టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల పెను భారం అయ్యేలా పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హన్మకొండలో భారీ నిరసన చేపట్టారు. టీఆరెఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో హాసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట జంక్షన్ వద్ద మహిళలు, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి కట్టెల పొయ్యి పై వంట చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని మండిపడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అచ్చే దిన్ ఆయేగా.. అచ్చే దిన్ ఆయేగా.. అని సామాన్య ప్రజలు బతకలేని స్థితికి తీసుకువచ్చి సచ్చే దిన్ తీసుకువచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా, బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆరెఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని పేర్కొన్నారు. పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు గుది బండగా మారాయని వెల్లడించారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ఏడాపెడా రేట్లు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ, దేశాన్ని, దేశ ప్రజలను పాతాళంలోకి నేడుతున్న బీజేపీ పార్టీని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.



Next Story