‘మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపారు.. మంత్రీ సీత‌క్క స్పందించాలి’

by Aamani |
‘మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపారు.. మంత్రీ సీత‌క్క స్పందించాలి’
X

దిశ‌, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం చ‌ల్పాక గ్రామ పోలుకొమ్మ అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంత‌రం పోలీసులు మావోయిస్టుల కుర్సం మంగు@బ‌ద్రు@పాప‌న్న(35), ముస్సాకీ దేవాల్‌@క‌రుణాక‌ర్‌(22), ముస్సాకీ జ‌మున‌(23), కిశోర్‌@దింసాం, జైసింగ్ బాడీలను పోలీసులు వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్పజెప్పారు. కాగా, హైకోర్టు అదేశాల మేరకు ఈ నెల 5వ తేదీ వ‌రకు ఏగోపు మ‌ల్ల‌య్య అలియాస్ మ‌ధు మృత‌దేహాన్ని మార్చురీలోనే భ‌ద్రప‌రిచిన విష‌యం తెలిసిన‌దే. కాగా 6 వ తేదిన(శుక్ర‌వారం) రోజున కోర్టు అదేశాల మేర‌కు హైకోర్టు న్యాయవాది ద‌శ‌ర‌థ్ అధ్వర్యంలో ఏగోపు మ‌ల్ల‌య్య మృత‌దేహ‌న్ని భార్య మీనా ప‌రిశీలించి చూసి ఫొటోలు తీసుకున్నారు. అనంత‌రం మ‌ల్ల‌య్య మృత‌దేహ‌న్ని స్వ‌గ్రామం అయిన పెద్ద‌ప‌ల్లి జిల్లా రాణాపూర్‌కు కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు.

ఈ సంద‌ర్బంగా మావోయిస్టు ఏగోపు మ‌ల్లయ్య భార్య మీనా మీడియాతో మాట్లాడారు. ఇది మూమ్మాటికీ బూటాక‌పు ఎన్ కౌంట‌ర్ అని అన్నారు. త‌న భ‌ర్త మ‌ల్ల‌య్య మృతదేహంపై ఎక్కడ కూడా బుల్లెట్ గాయాలు లేవ‌ని, కాళ్లు చేతులు విరిచిన‌ట్టుగా ఉన్నాయ‌ని, మ‌త్తులో ఉన్న‌ప్పుడు త‌ల‌పై కొట్టి త‌ల స‌గభాగం ఛిద్రం చేసి చంపేశారని ఆమె మీడియా ముందు తెలిపారు. పోలీసుశాఖ అధికారులు చెబుతున్న‌ట్టు ఇది నిజ‌మైన ఎన్‌కౌంట‌ర్ కాద‌ని, బుటాక‌పు ఎన్‌కౌంట‌ర్ అని అన్నారు. ఎన్ కౌంట‌ర్‌పై తమకు అనుమానం ఉంద‌ని, అందుకే హకోర్టులో పిటిష‌న్ వేశామ‌ని అన్నారు. అంతేకాదు.. పోస్టుమార్టం స‌మ‌యంలో తాను సంతకం కూడా పెట్టలేదని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫోరెన్సిక్ డాక్ట‌ర్లు పోస్టుమార్టం నివేదిక కోర్టుకు స‌మ‌ర్పించలేద‌ని అందుకే త‌మ‌కు అనుకులంగా కోర్టు అనుమ‌తి ఇచ్చింద‌ని, నిజా నిజాలు రేపు కోర్టులో తెలుస్తాయ‌ని మీనా అన్నారు.

నివేదిక‌ను కోర్టులో దాఖ‌లు చేస్తాం: హైకోర్టు న్యాయ‌వాది ద‌శ‌ర‌థ్‌

ఏగోపు మ‌ల్లయ్య మృత దేహాన్ని పూర్తిగా ప‌రిశీలించి కావాల్సిన ఫొటోలు, వీడియోలు తీసుకోవ‌డం జ‌రిగిందని హైకోర్టు న్యాయ‌వాది ద‌శ‌ర‌థ్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లడుతూ.. హైకోర్టు అదేశాల మేర‌కు డీఎస్పీ ర‌వీంద‌ర్ సంద‌ర్శన‌లో శుక్రవారం రోజున మృతుడు మావోయిస్టు మ‌ల్ల‌య్య మృత దేహాన్ని ప‌రిశీలించ‌డం కావాల‌సిన ఫొటోలు, వీడియాలు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ ప‌రిశీల‌న‌లో మ‌ల్ల‌య్య మృతదేహంపై బుల్లెట్ గాయం క‌న‌బ‌డ‌లేద‌ని, అనుమానం వ‌చ్చి మృత దేహ‌న్ని తిప్పి చూడ‌డం జ‌రిగింద‌ని త‌ల వెనుక స‌గ భాగం పూర్తిగా ఛిద్రం అయింద‌ని, ఒక క‌న్ను లేకుండా ఉండ‌డం, నోటిలోని ప‌ళ్లు సగం లేకుండా ఉండ‌డం, మోకాలు విరిచిన‌ట్టు ఉండ‌డం గ‌మ‌నించామ‌న్నారు. ఈ రోజు ప‌రిశీలన‌లో జ‌రిగిన వివ‌రాల‌ను కోర్టు దాఖలు చేయ‌డం జ‌రుగుతుంద‌ని హైకోర్టు న్యాయ‌వాది ద‌శ‌ర‌థ్ తెలిపారు.

మంత్రి సీత‌క్క స్పందించాలి..

తెలుగు రాష్ట్రాల‌ బంధు మిత్రుల సంఘం ఉపాధ్య‌క్షురాలు, స‌భ్యులు శాంత, భార‌తి మాట్లాడుతూ.. 5 రోజులుగా అసుప‌త్రి చుట్టూ తిర‌గ‌డం జ‌రుగుతుంద‌ని, పోలీసులు క‌నీసం అసుపత్రి ప్రాంగణంలో కూర్చోనివ్వ‌డం లేద‌న్నారు. క‌నీసం మృతదేహాన్ని చూసుకునే హ‌క్కు ఉందా లేదా అని వారు ప్ర‌శ్నించారు. మంత్రి సీత‌క్క కూడా ఉద్యమం నుండే వ‌చ్చారని, తన నియోజ‌కవ‌ర్గంలో ఘ‌ట‌న జ‌రిగితే క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌ట‌న ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆదివాసి ఓట్లతో గెలిచిన మంత్రి సీత‌క్క స‌మాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed