ఓరుగ‌ల్లులో బ‌తుక‌మ్మ హోరు.. ఘ‌నంగా ఆరంభ‌మైన పూల‌జాత‌ర‌

by Dishanational2 |
ఓరుగ‌ల్లులో బ‌తుక‌మ్మ హోరు.. ఘ‌నంగా ఆరంభ‌మైన పూల‌జాత‌ర‌
X

దిశ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పర్వదిన వేడుకలు ఆదివారం ఓరుగల్లులో అట్టహాసంగా ఆరంభ‌మ‌య్యాయి. పితృ అమావాస్యను పుర‌స్కరించుకుని ఆదివారం ఎంగిలిపూల బ‌తుక‌మ్మతో పూల‌జాత‌ర ఆరంభ‌మైంది. పితృ అమవాస్య రోజు తొలి బతుకమ్మను పేర్చిన మ‌హిళ‌లు ఆటలు ఆడి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. సెప్టెంబ‌ర్ 25న ఆరంభ‌మైన వేడుక‌లు అక్టోబ‌ర్ 3 వరకు సాగ‌నున్నాయి. బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు పేరుగాంచిన వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలో వేడుక‌లు ఘ‌నంగా ఆరంభ‌మ‌య్యాయి.

ఊరూరు పూల జాత‌ర‌తో సింగిడిని త‌ల‌పించింది. బ‌తుక‌మ్మ పాట‌ల‌తో ఓరుగ‌ల్లంతా హోరెత్తింది. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండన‌గ‌రాల‌తో భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ‌, ములుగు, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. ప‌లుచోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జ‌డ్పీచైర్మన్లు వేడుక‌ల్లో పాల్గొన్నారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడుతూ సంద‌డి చేశారు. ఆరు జిల్లాల ప‌రిధిలోని ప‌ట్టణాల‌న్ని బ‌తుక‌మ్మ వేడుక‌ల‌తో జింగేల్‌మ‌న్నాయి. ఊర్లన్నీ ఉత్సాహంతో వెలుగొందాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రంగురంగుల పట్టుచీరలు, పట్టుపరికిణీలు.. ఒళ్లంతా నగలతో ఆడబిడ్డలంతా సింగారించుకుని ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. ఆట‌పాట‌ల‌తో.. వివిధ రూపాల నృత్యాలతో మ‌హిళ‌లు ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. సంప్రదాయ‌, ఆధునిక‌ల క‌ల‌బోత‌గా బ‌తుక‌మ్మ ప‌ర్వం సాగింది. ఓ వైపు పాతత‌రం ఒక్కోసి పువ్వేసి చంద‌మామ అంటూ పాట‌ల‌నందుకుని సంద‌డి చేస్తే.. డీజే పాట‌ల‌కు అనుగుణంగా యువ‌తులు పాట‌లు, కోలాట‌ల‌తో ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు.. అందరూ బతుకమ్మ ఆటల్లో కాలు కదిపారు. రకరకాల నృత్య రీతులతో.. ఆనందంగా పండుగను ఆస్వాదించారు.

త్రిన‌గ‌రిలో..

ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు వెయ్యిస్తంభాల ఆల‌యంలో జ‌రిగే ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తొలిరోజున జ‌రిగే వేడుక‌ల్లో ప‌ట్టణంలోని వేలాది మంది య‌వ‌తులు, మ‌హిళ‌లు ఇక్కడి వేడుక‌ల్లో పాల్గొన‌డం అనవాయితీగా వ‌స్తోంది. తొలిసారిగా బ‌తుక‌మ్మను పేర్చే వారు సైతం ఇక్కడి వేడుక‌ల్లో పాల్గొంటుంటారు. ఎప్పటిలాగే ఈ సంవ‌త్స‌రం కూడా వేలాది మంది మ‌హిళ‌లు, యువ‌తులు ఆల‌యానికి త‌ర‌లివ‌చ్చి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. వ‌రంగ‌ల్‌లోని ఖిలావ‌రంగ‌ల్‌, శివ‌న‌గ‌ర్‌, కరీమాబాద్, ఉరుసు, రంగశాయిపేట, గిర్మాజిపేట, వరంగల్ చౌరస్తా , పోచమ్మ మైదాన్, తదితర ప్రాంతాలలో వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పట్టుకుని వచ్చి సంప్రదాయమైన బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. కాజీపేట‌,మ‌డికొండ‌లోని ప‌లు ఆల‌యాల వ‌ద్ద సైతం


ఏ రోజు ఏ బతుకమ్మని పూజిస్తారంటే..

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. స‌ద్దుల బ‌తుక‌మ్మను పెద్ద బ‌తుక‌మ్మ అని కూడా అంటారు. స‌ద్దుల బ‌తుక‌మ్మ రోజూ నీటిలో నిమజ్జనం చేస్తారు.

సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారంటే..

సెప్టెంబరు 25 - ఎంగిలి పూల బతుకమ్మ

సెప్టెంబరు 26 - అటుకుల బతుకమ్మ

సెప్టెంబరు 27 - ముద్దపప్పు బతుకమ్మ

సెప్టెంబరు 28 - నానే బియ్యం బతుకమ్మ

సెప్టెంబరు 29 - అటుకుల బతుకమ్మ

సెప్టెంబరు 30 - అలిగిన బతుకమ్మ

అక్టోబరు 1 - వేపకాయల బతుకమ్మ

అక్టోబరు 2 - వెన్నముద్దల బతుకమ్మ

అక్టోబరు 3 - సద్దుల బతుకమ్మ


Next Story