ఆమెకు న‌చ్చినోళ్లకే బీర్లు!

by Mahesh |
ఆమెకు న‌చ్చినోళ్లకే బీర్లు!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : హ‌న్మకొండ జిల్లా కేంద్రంలోని గుండ్ల సింగారం ఐఎంఎల్ డిపోలో కీల‌క బాధ్యత‌ల్లో ఉన్న మ‌హిళా అధికారిని ప‌నితీరుపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ‌ద్యం కొర‌త ఏర్పడ‌టంతో న‌చ్చిన వ్యాపారుల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తూ..త‌న దారికి రాని వ్యాపారుల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాలో కొర్రీలు చూపుతున్నట్లుగా ఆరోప‌ణ‌లు వ్యక్తమ‌వుతున్నాయి. రోజూవారీగా వ‌చ్చిన స‌రుకును ముందుగా ఆర్డర్ పెట్టుకున్న వ్యాపారుల‌కు సమానంగా పంపిణీ చేయాల్సి ఉండ‌గా, అలా కాకుండా మాములుగా స‌హ‌క‌రిస్తున్న మాత్రమే మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తూ మిగ‌తా వారికి మొండి చేయి చూపుతున్నట్లుగా మ‌ద్యం వ్యాపారుల నుంచి విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈ విష‌యంలో అధికారిణిపై ఉన్నతాధికారుల‌కు ఫిర్యాదు చేసినా చ‌ర్యలు లేక‌పోవ‌డం వెనుక ఉన్నతాధికారుల అండ‌దండ‌లున్నట్లు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. డిపోలో జ‌రుగుతున్న అక్రమాలు, వ‌సూళ్ల వెనుక వారికి భాగ‌స్వామ్యం ఉంటాయ‌ని వ్యాపారులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇదీ మేడ‌మ్ ప‌నితీరు..!

వేసవిలో సాధార‌ణంగానే బీరు అమ్మకాలు 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. మద్యం వ్యాపారులు వేసవి ముందుగానే బీర్లను అధికమొత్తంలో కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకుంటారు. వేసవి ప్రారంభం కావడంతో గతంలో తెచ్చుకున్న స్టాక్‌ అయిపోవడంతో తగినంత బీరు సరఫరా లేక మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్‌ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం వివిధ బ్రాండెడ్‌ల మద్యం కొనుగోలు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం డిపోలకు సరఫరా చేస్తుంది. అక్కడి నుంచి మద్యం రిటైల్‌ షాపులకు సరఫరా అవుతుంది. అయితే పలు లిక్కర్‌ తయారీ కంపెనీలు సరఫరా చేసిన మద్యంకు ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కొన్ని డిస్టిల్లరీస్‌, బ్రేవరీస్‌లు మద్యం ఉత్పత్తిని తగ్గించినట్లు సమాచారం. ఈనేప‌థ్యంలో మ‌ద్యం కొర‌త ఏర్పడుతోంది.

దాదాపుగా నెల‌రోజులుగా లిక్కర్‌, విస్కీ, బీర్ల కొర‌త తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సాధార‌ణ, మ‌ధ్య త‌ర‌గ‌తి మందుబాబులు వినియోగించే బ్రాండ్ల కొర‌త ఏర్పడింది. బీర్లు, మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగ‌దారుల కొనుగోళ్లే వైన్‌షాపుల‌కు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో వ్యాపారులు డిపోల వ‌ద్దకే ప‌రుగులు పెడుతున్నారు. బీర్లు, కొన్ని విస్కీ బ్రాండ్ల కోస‌మూ ఏకంగా ఎక్సైజ్‌లోని కీల‌క అధికారులతో పైర‌వీలు చేయించుకుంటే గాని ప‌ని కావ‌డం లేద‌ని వ్యాపారులు వాపోతున్నారు. మ‌ద్యం కొర‌త‌ను ఆస‌రాగా చేసుకున్న డిపోలో కీల‌క స్థానంలో ఉన్న అధికారిని త‌న‌కు మాములుగానే స‌హ‌క‌రించ‌ని వ్యాపారుల‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న దారికి వ‌చ్చిన వ్యాపారుల‌కు ఫోన్ల మీద‌నే స‌రుకును రెడీ చేసి స‌ర‌ఫ‌రా లిస్టులో ముందుగా ఉంచుతున్నట్లు స‌మాచారం.

ఫిర్యాదును ప‌ట్టించుకోరా..? ఉన్నతాధికారుల వైఖ‌రిపై అనుమానాలు

ఇదిలా ఉండ‌గా అస‌లే మ‌ద్యం కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో ఎప్పటిక‌ప్పుడు వివిధ బ్రాండ్ల మ‌ద్యం డిపోకు చేరుకోగానే వెంట వెంట‌నే అన్‌లోడ్‌కు ఆదేశాలివ్వాల్సి ఉండ‌గా ఉద్దేశ్వపూర్వకంగా అధికారిణి నిలిపివేస్తున్నట్లు స‌మాచారం. ఈ విష‌యంలో అటు హ‌మాలీలు, కంపెనీల‌కు చెందిన వాహ‌న‌దారులతో పాటు ఆర్డర్ పెట్టుకున్నా స‌మ‌యానికి మ‌ద్యం స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌డంతో వ్యాపారులు ఇబ్బందులకు గుర‌వుతున్నారు. అంతేకాక కూలీలు వినియోగించే బ్రాండ్ల మ‌ద్యం దిగుమ‌తిలో జాప్యం జ‌రుగుతుండ‌టంతో.. దుకాణాల్లో ల‌భ్యం కావ‌డం లేదు.

ఫ‌లితంగా స‌ద‌రు కూలీ ప‌నిచేసుకునే జ‌నం గుడుంబా తాగేందుకు వెళ్తున్నట్లుగా వ్యాపారులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రభుత్వ ఆదాయానికి గండిప‌డేలా చేస్తున్న అధికారిణిని ఉన్నతాధికారులు ప్రొత్సహించ‌డంపై మ‌ద్యం వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఎక్సైజ్‌లోని వ‌రంగ‌ల్‌లోని కీల‌క అధికారుల‌కు స‌మాచారం ఇచ్చినా ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకునే నాథుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు వ్యాపారులు సిద్ధమ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.



Next Story

Most Viewed