పిట్ట కథలతో కేసీఆర్​ పబ్బం : వైఎస్ షర్మిల

by Disha Web |
పిట్ట కథలతో కేసీఆర్​ పబ్బం : వైఎస్ షర్మిల
X

దిశ, హన్మకొండ టౌన్ : పిట్ట కథలతో కేసీఆర్​ పబ్బం గడుపుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హన్మకొండ పెట్రోల్ పంప్ వద్ద తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ వరంగల్ నగరంపై కేసీఅర్ కి ప్రేమ లేదని, ఇక్కడకు వచ్చిన ప్రతి సారి ఎన్నో పిట్ట కథలు చెప్పి పోతుంటాడని, బల్దియాకు స్థానిక ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా అదనంగా రూ.300 కోట్లు ఇస్తా అని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తా అని చెప్పారని, అది ఎప్పుడో చెప్పాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తర్వాత ఐటీ హబ్ చేస్తా అని హామీ ఇచ్చారని, వేలమందికి ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేశారని ఆరోపించారు. వరంగల్ కు ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తామని హామీ ఇచ్చి ఒక్క పరిశ్రమ తేలేదని విమర్శించారు.

అజంజాహి మిల్స్ మూతపడితే ఓపెన్ చేయ చేత కాలేదని, 12 వందల ఎకరాలు భూ సేకరణ అని చెప్పి కబ్జాలు చేశారు తప్పితే ఆ పార్క్ లో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. టెక్స్​ టైల్ పార్క్ కోసం భూములు ఇవ్వం అని పురుగు మందు డబ్బాలు పట్టుకొని ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు మెట్రో ఏర్పాటు అని, రూ.13 వందల కోట్లు కేటాయింపు అని మోసం చేశారని ఆరోపించారు. ఇటీవల వరదలకు వరంగల్ లో చాలా ప్రాంతాలు మునిగిపోతే తక్షణం సైడ్ వాల్స్ నిర్మాణం అని చెప్పి ఒక్క కాలువ నిర్మాణం కూడా జరగలేదని తెలిపారు. ఇదే వరంగల్ వేదికగా జర్నలిస్ట్ లకు చేసిన మోసం అంతా ఇంతా కాదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తానని చెప్పి పత్తాలేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క జర్నలిస్ట్ కు ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గత ఏడాది ఇదే వరంగల్ జిల్లాలో అకాల వర్షాలకు 56 వేల ఎకరాల్లో 25 వేల మంది రైతులకు నష్టం జరిగిందని, రూ. 900 కోట్లు నష్టం జరిగితే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. వరంగల్ అంటే మహా కవి కాళోజీ నారాయణ రావు పుట్టిన జిల్లా అని, చివరికి ఆయనకు కూడా గౌరవం ఇవ్వలేదని, ఆయన పేరుమీద కళాక్షేత్రం కడతా అని 2014 సెప్టెంబర్ 9 న ప్రకటన జేశారని ఇప్పటి వరకూ దిక్కు మొక్కు లేదన్నారు. కమీషన్ ల కోసమే కాళేశ్వరం కట్టారని, కాళోజీకి భవనం కట్టలేక పోయారని పేర్కొన్నారు.

ఇదే జిల్లా కు వైఎస్సార్ హయాంలో ఎంతో న్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి సాగునీరు అందించే లక్ష్యంగా దేవాదుల ప్రాజెక్ట్ కట్టారని, 6 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని భావించగా ఆయన చనిపోయే నాటికి 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. 70 శాతం వై ఎస్ ఆర్ పూర్తి చేసినా మిగిలిన 30 శాతం పనులు కేసీఆర్ పూర్తి చేయలేక పోయారని దెప్పిపొడిశారు. ఎస్ ఆర్ ఎస్ పీ ఫేజ్ - 2 ద్వారా కాకతీయ కెనాల్ ను విస్తరించి 3 లక్షల 90 వేల ఎకరాలకు సాగునీరు అందేలా చేసిన కృషి వై ఎస్ ఆర్ దే అన్నారు. ఉచిత కరెంట్ పథకం ద్వారా ఈ జిల్లాలో 2 లక్షల 40 వేల మంది రైతులు ఆనాడే లబ్ది పొందారని, అప్పటి వరకు ఉన్న రూ.100 కోట్ల కరెంట్ బిల్లులు మాఫీ చేశారని తెలిపారు. జిల్లాలో 43,788 ఎకరాల భూమికి పోడు పట్టాలు అందించారన్నారు. వైఎస్సార్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కేసీఅర్ 9 ఏళ్లలో చేయలేక పోయారని ఆరోపించారు. తెలంగాణలో బాగుపడింది కేసీఅర్ కుటుంబమే అన్నారు. రాష్ట్రంలో మాత్రం ఉద్యోగాలు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఅర్ BRS పార్టీ అకౌంట్ లో రూ.860 కోట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ బార్ అండ్​ రెస్టారెంట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇకనైనా వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని కోరారు.Next Story