అక్రమాలకు అడ్డాగా కంచనపల్లి పీఏసీఎస్

by Mahesh |
అక్రమాలకు అడ్డాగా కంచనపల్లి పీఏసీఎస్
X

రైతులకు రుణాలు అందించి వెన్నుదన్నుగా నిలవాల్సిన సహకార బ్యాంక్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే పలు సార్లు ఈ సంఘంలో అక్రమాలు చోటు చేసుకోగా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం రివాజుగా మారింది. కంచనపల్లి వ్యవసాయ సహకార సంఘంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్న అధికార యంత్రాంగం మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు డైరెక్టర్లు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, డీసీఎస్ బ్యాంక్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగంలో మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఫిర్యాదు చేసి నెల రోజులు కావస్తున్నా అక్రమాలపై నిగ్గు తేల్చడంలో జిల్లా అధికారులు నాన్చివేత ధోరణిని అనుసరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ చైర్మన్ చీమలపాటి రవి ఆరోపిస్తున్నా అధికారుల్లో ఎటువంటి స్పందన లేదు. అక్రమాలపై కాంగ్రెస్ డైరెక్టర్లు విచారణ చేయాలని పట్టుబట్టినా ఇందులో కొంచెం కూడా పురోగతి లేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన్నట్లుగా సహకార సంఘంలో జరిగిన నగదు దుర్వినియోగంపై బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని డైరెక్టర్లు అనుమానిస్తున్నారు. ఒకవైపు లిఖితపూర్వక ఫిర్యాదులు, పత్రికా ముఖంగా కాంగ్రెస్ నాయకులు గొంతు చించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

దిశ, జనగామ: రైతులకు రుణాలు అందించి వెన్నుదన్నుగా నిలవాల్సిన సహకార బ్యాంక్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే పలు సార్లు ఈ సంఘంలో అక్రమాలు చోటు చేసుకోగా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం రివాజుగా మారింది. కంచనపల్లి వ్యవసాయ సహకార సంఘంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్న అధికార యంత్రాంగం మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘంలో దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఇప్పటికే పలువురు డైరెక్టర్లు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, డీసీఎస్ బ్యాంక్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా అధికార యంత్రాంగంలో మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఫిర్యాదు చేసి నెల రోజులు కావస్తున్నా అక్రమాలపై నిగ్గు తేల్చడంలో జిల్లా అధికారులు నాన్చివేత ధోరణిని అనుసరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ చైర్మన్ చీమలపాటి రవి ఆరోపిస్తుండగా ఆ సంఘంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ డైరెక్టర్లు విచారణ చేయాలని పట్టుబట్టారు. ఇప్పటికీ ఇందులో ఈసమంత కూడా పురోగతి లేదు.

విచారణకు పంపుతున్నట్లుగా చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ల వాంగ్మూలం సేకరించి వదిలేయడంపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన్నట్లుగా సహకార సంఘంలో జరిగిన నగదు దుర్వినియోగంపై బ్యాంకు అధికారుల పాత్ర ఉందని డైరెక్టర్లు అనుమానిస్తున్నారు. అధికారుల సహకారం లేకుండా చెక్కులు ఎలా విడిపించారాని? కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు లిఖితపూర్వక ఫిర్యాదులు, పత్రికా ముఖంగా కాంగ్రెస్ నాయకులు గొంతు చించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

సీఈవో పాత్రపై అనుమానాలు?

కంచనపల్లి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అక్రమాల వెనుక బ్యాంక్ సీఈవో వంగ శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీఈఓ తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని చైర్మన్ రవీందర్ ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో, డీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై డీసీఎస్ అధికారులు ఇంతవరకు దృష్టి దారించక పోవడం విచారకరం. శాఖాపరంగా విచారణ చేస్తున్నామని చెబుతున్నా ఉన్నతాధికారులు ఈ అక్రమాల సూత్రధారికి సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే దీనిపై విచారణ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఈఓ అక్రమాలకు పాల్పడకపోతే మరి చెక్కులు విడిపించింది ఎవరు? అనే కోణంలో కూడా అధికారులు ఎటువంటి పురోగతి సాధించకపోవడం మరింత అనుమానాలను పెంచుతోంది.

సీఈఓ, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా బ్యాంక్ నుంచి నగదు ఎలా విడిపించారు? ఎవరు విడిపించారు? అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు. సీఈఓకు అవినీతితో సంబంధం లేకపోతే ఈ అవినీతికి పాల్పడింది ఎవరు? అనే దానిపై అధికార యంత్రాంగం నిగ్గు తేల్చాల్సి ఉంది. అలా కాకుండా ఉన్నతాధికారులు సాగదీత ధోరణి అవలంభిస్తుండడం సరికాదని పలువురు అంటున్నారు. అందువల్ల అధికార యంత్రాంగం ఈ అవినీతిపై దృష్టి సారించి దోషులను గుర్తించాలని, లేకపోతే ఇటు సీఈవో, అటు డీసీఎస్ అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు బలపడే అవకాశం ఉంది.

మూడేళ్లలో కోటికిపైనే ఆదాయం?

ఈ మూడేళ్లలో వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వహణ కారణంగా కంచనపల్లి సంఘానికి కమిషన్ రూపంలో రూ.1.10కోట్లు రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నుంచి రూ.53 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు ఫిబ్రవరి చివరి లో జరిగిన సమావేశంలో సీఈవో లెక్కలు చూపాడు. కానీ, ఇందుకు సంబంధించిన రసీదులు, దస్త్రాలు మాత్రం చూపలేకపోయాడు. దీంతో ఖర్చు చేసిన రూ.53 లక్షల సొమ్ముపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక సహకార సంఘానికి జిల్లా సివిల్ సప్లై విభాగం నుంచి మంజూరైనా.. రూ.80 లక్షల సొమ్ముకు కూడా లెక్కలు సరిగా లేకపోయినా.. విచారించాల్సిన డీసీఎస్ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్వయంగా డైరెక్టర్లే వాపోతున్నారు. దీంతో డీసీఎస్ అధికారులు, జిల్లా బ్యాంక్ అధికారుల పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ల ఆరోపణలపై ఈ జిల్లాకు చెందిన సహకార శాఖకు సంబంధించిన అధికారులతో కాకుండా ఇతర జిల్లాకు చెందిన అధికారులతో విచారణ చేపడితే నగదు లావాదేవీల అక్రమాల గుట్టురట్టయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

ఖాతా ఎందుకు క్లోజ్ చేశారు?

సంఘానికి రెండు పర్సనల్ ఖాతాలు ఉన్నాయి. ఒకటేమో కంచన పల్లి గ్రామానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ లో, మరొకటి జిల్లా సహకార బ్యాంకులో. అయితే ఇటీవల కాలం వరకు సహకార సంఘం సీఈవో సెంట్రల్ బ్యాంక్ ఖాతాను నిర్వహించి ఈ మధ్యకాలంలో క్లోజ్ చేశారు. దీని పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2022 వార్షిక సంవత్సరం వరకు ఈ ఖాతా చలామణిలో ఉంది. అటువంటి ఖాతాను ఎందుకు క్లోజ్ చేశారు? అనే దానిపై కూడా ఇప్పటివరకు అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. ఇంతకీ ఈ బ్యాంకులో నుంచి సొమ్మును విడిపించింది ఎవరు? విడిపించిన సొమ్ము దేనికోసం ఖర్చు చేశారు? నగదును విడిపించిన తర్వాత ఖాతాలను ఎందుకు క్లోజ్ చేశారు.? సాక్ష్యాలు లేకుండా చేయాలని ఉద్దేశంతోనే దీన్ని క్లోజ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఫిర్యాదు అందినా స్పందన కరువు..

సహకార సంఘంలో అవినీతి జరిగిందంటూ డైరెక్టర్లు ఫిర్యాదు చేసిన వెంటనే డీసీఎస్ అధికారులు స్పందించకుండా ఫిర్యాదు దారులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఫిర్యాదు తీసుకున్నప్పటికీ ఎటువంటి అకనాలెడ్జ్‌మెంట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్‌లో చైర్మన్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తుంది. సహకార సంఘం పరిధిలో కొత్తగా మంజూరైన పెట్రోల్ పంపు నిర్మాణం కోసం రూ.8లక్షలు, సిమెంట్ బ్రిక్స్ రెడీమేడ్ వాల్ నిర్మాణం కోసం రూ.6లక్షలు, సహకార సంఘం ఆధ్వర్యంలోని వ్యవసాయ భూమి పట్టాదారు పాసుపుస్తకాల కోసం రూ.2.5లక్షలు ఖర్చు చేసినట్లు చూపుతున్నా వాటిలో కూడా అక్రమాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి.

కలెక్టర్ దృష్టి సారించాలి..

కంచనపల్లి పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య దృష్టి సారించి దోషులపై చర్యలు తీసుకోవాలని సహకార సంఘం రైతులు కోరుతున్నారు. విచారణ పేరుతో డీసీఎస్ అధికారులు కాలయాపన చేస్తున్నారని, వెంటనే విచారణ అధికారులను నియమించి అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. లేకపోతే రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Next Story

Most Viewed