అక్రమార్కులకు రెవెన్యూ అండ.. ముడుపులు ముట్టనిదే ఏ పని కాదు

by samatah |
అక్రమార్కులకు రెవెన్యూ అండ.. ముడుపులు ముట్టనిదే ఏ పని కాదు
X

దిశ, దుగ్గొండి: మండల రెవెన్యూ అధికారి అండదండలతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి వెళ్లగానే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, దుగ్గొండి మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాలంటే తప్పనిసరిగా మధ్యన ఓ దళారి ఉండాల్సిందే. లేదంటే ఆ అధికారి ఫైల్​ను ఎదో కొర్రీ పెట్టి ఆపేస్తాడు. ఇంతకు ముందు పని చేసిన దగ్గర సస్పెండైనా తీరుమాత్రం మారలేదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఎకరాకు రూ.300నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. కార్యాలయ సిబ్బందిని ఏజెంట్ నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కోర్టుల్లో కొన్నేళ్లుగా కేసులు నడుస్తున్న భూములపై కలుగజేసుకొని ఆ వ్యక్తులకు నోటీసులు ఇచ్చి నానా ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు లేకపోలేదు. సాధారణంగా రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకున్న తరువాత స్లాట్ పేపర్, పట్టా పాస్ బుక్ తీసుకొని వెళ్లాలి. కానీ పట్టా పాస్ బుక్కులు బ్యాంక్ లో ఉంటాయి. దీంతో తెలివిగా దళారులు ఆ అధికారి అండదండలతో బ్యాంకులో రుణం కోసం తనఖా పెట్టిన పట్టా పాస్ బుక్ లేకుండా కమీషన్ మాట్లాడుకుని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. దీంతో బ్యాంక్ రుణాన్ని పొందిన వ్యక్తులు తిరిగి వేరే వ్యక్తులకు అదే సర్వే నెంబర్లతో బదలాయింపు చేస్తూ రెవెన్యూ లీలలు ప్రదర్శిస్తున్నారు.

ముడుపులు ముట్టనిదే పనికాదు..

పట్టాదారులైన తల్లిలేదా తండ్రి గాని చనిపోతే వాళ్ల వారసులకు ఆ భూమిని పట్టాచేయడం కోసం అనేక కొర్రీలు పెడుతూ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్లాట్ పేపర్లతో పాటు అఫిడవిట్ సమర్పించిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ కావాలని, అది తానే ఇవ్వాల్సి ఉంటుందని బాధిత రైతు కుటుంబాలను ఆందోళనకు గురిచేసి ముడుపులు ముట్టనిదే పని చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

సొంత వాహనంతో వెహికల్ అలవెన్సులు..

రాష్ట్ర ప్రభుత్వం అధికారికి ట్యాక్సీ ప్లేట్ వాహనానికి ఇచ్చే వెహికల్ అలవెన్సును ఈయన సొంత వాహనంను వాడుకుంటూ ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు సదరు అధికారిపై చర్యలు తీసుకుని నాయ్యం చేయాలని బాధిత రైతులు కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed