కేసీఆర్‌కు వాటిని గుర్తు చేసే లేఖ రాస్తా: మందకృష్ణ మాదిగ

by Disha Web Desk 12 |
కేసీఆర్‌కు వాటిని గుర్తు చేసే లేఖ రాస్తా: మందకృష్ణ మాదిగ
X

దిశ, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్ధానాలు గుర్తు చేసే లేఖ రాస్తానని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరిచిన వాగ్ధానాలను ఎనిమిది సంవత్సరాలు దాటిన నేటికి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తీర్చలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులు.. పోలీసుల దెబ్బలు తిని కెమెరాలు పగిలిన ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ సాధనే ధ్యేయంగా పని చేశారని అన్నారు.

జర్నలిస్టుల సమస్యల సాధన కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని మరో ఉద్యమానికి MRPS తరపున పోరాటం చేస్తామని చెప్పారు. పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అక్రెడిషన్ కార్డు జారీ చేయాలని, వారి నివాసం కోసం ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జర్నలిస్టుల సమస్య సాధన కోసం మహాజన వర్కింగ్ యూనియన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టుల యూనియన్‌లతో పాటు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.


Next Story

Most Viewed