ఏనుమాములకు రాజకీయ గ్రహణం !

by Sumithra |
ఏనుమాములకు రాజకీయ గ్రహణం !
X

దిశ, వరంగల్ టౌన్ : రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. మా పార్టీ రైతుల పక్షపాతి.. అని ఊదరగొట్టే అధికార పార్టీ ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పాలకవర్గం నియామకంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ మార్కెట్‌ పాలకవర్గం పదవీ కాలం ముగిసినా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కమిటీని నియమించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా మార్కెట్‌ అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారానికి రాజకీయ గ్రహణం పట్టినట్లయింది. పాలకులు లేకపోవడంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా నడుస్తోంది.

వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దది. అంతకుమించి మార్కెట్‌కు ఇతర గుర్తింపు లేదనడానికి మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులే కారణంగా నిలుస్తున్నాయి. ఈ మార్కెట్‌ పరిధిలోని డివిజన్‌ స్థాయి మార్కెట్లకు పాలకవర్గాలు ఉన్నా ఏనుమాముల మార్కెట్‌కు రెండేళ్లుగా నియమించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. 2023, ఆగస్టు 16న దిడ్డి భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌ పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఆ కుర్చీ ఖాళీగానే ఉంటోంది. రెండేళ్ల కాలం దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు మార్కెట్‌కు కొత్త పాలకవర్గం నియామకంలో అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారుతో పాటు ఇప్పటి కాంగ్రెస్‌ సర్కారు కూడా చొరవ చూపకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలకవర్గాన్ని ప్రకటించినా ఎన్నికల కోడ్‌తో అంతా మరిచిపోయినట్టయింది.

అవినీతి, అక్రమాలకు అడ్డాగా..

ఏనుమాముల మార్కెట్‌లో అవినీతి, అక్రమాలు సైతం పెద్ద ఎత్తునే సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కూలీలు, హమాలీలు, అధికారులు, వ్యాపారులు సైతం రైతులను దోపిడీ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే, టెంపరరీ రశీదు(టీఆర్‌)ల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే కారణంతో ఏనుమాముల ఉన్నతశ్రేణి మార్కెట్‌ కార్యదర్శి పోలెపాక నిర్మలతో పాటు మరికొన్ని మార్కెట్ల కార్యదర్శుల పై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే, ఇదొక్కటే కాదు, ఏనుమాముల మార్కెట్లో అడుగడుగునా అక్రమాలే సాగుతున్నాయనేది ఉన్నతాధికారులకు కూడా తెలిసిన విషయమే.

మార్కెట్‌కు వచ్చిన ఏ సరుకైనా కూలీలు, హమాలీలు దౌర్జన్యంగా లాక్కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మిర్చి సీజన్‌ కొనసాగుతుండగా చేతికి అందిన కాడికి దోచుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ దోపిడీ ఈ మార్కెట్‌లోనే ఉందా ? ఇతర మార్కెట్లలో కూడా ఉందా ? అనేందుకు ఇటీవల మార్కెట్‌ నుంచి కొందరు ఇతర మార్కెట్లను పరిశీలించి రావడం ఏనుమాముల మార్కెట్లో దోపిడీ జరుగుతున్నదనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మరో ప్రధానమైన అంశం మార్కెట్‌లో ధరల పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జెండాపాటకు సాధారణ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడం పై రైతులు నిరసన వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మార్కెట్‌కు ఆదాయం తగ్గిందని, అందుకు గల కారణాలేమిటని ఏకంగా జేడీఎం ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్‌లో వ్యాపారుల ఆగడాలకు అద్దం పడుతున్నాయి.

ఎవరికి వారే యమునా తీరే !

పాలకవర్గం లేదు. కార్యదర్శి సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇన్‌చార్జ్‌ కార్యదర్శితోనే రెండు నెలలుగా కాలం వెళ్లదీస్తున్నారు. పాలకవర్గం లేకపోవడంతో రెండేళ్లుగా మార్కెట్‌ వ్యవహారాలు మొత్తం గాడి తప్పాయి. సూపర్‌వైజర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందినకాడికి దోచుకోవడానికి వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారు. వ్యాపారులే అధికారులను శాసించే స్థాయిలో పావులు కదుపుతున్నారు.

ఎన్నికల కోడ్‌తో నిలిచిన ప్రమాణస్వీకారం..

మూడు నెలల క్రితం ఎర్ర ప్రియాంకను మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో ప్రమాణస్వీకారం చేస్తారని అంతా అనుకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఆటంకం ఏర్పడింది. ఇదే క్రమంలో రాజకీయ గ్రహణం అలుముకుంది. అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రియాంక నియామకం పై నిరసనకు దిగడం మొత్తం నియామకంపైనే నీలినీడలు అలుముకున్నాయి. దీంతో ప్రకటించిన కమిటీ కూడా కాగితాలకే పరిమితమైంది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించేనా ?

ఎన్నికల కోడ్‌తో వాయిదాపడిన మార్కెట్‌ కమిటీ నియామకంపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారిస్తుందని రైతులు, పలువురు వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా ఇంతవరకు మార్కెట్‌ కమిటీ పై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క మార్కెట్‌లో కొందరు వ్యాపారులు పెత్తనం చలాయిస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లు, ధరల నిర్ణయం పై వారు చెప్పిందే వేదంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, గురువారం మార్కెట్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన మార్కెట్‌ పాలనా వ్యవహారాల పై వ్యాపారుల పెత్తనం ఏపాటిదో అర్థమవుతోంది.

కొనుగోలు చేయొద్దని చాంబర్‌ హుకుం..

మార్కెట్‌లో ఓ అడ్తిదారుడికి చెందిన సరుకులను కొనుగోలు చేయొద్దని ఖరీదుదారులకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొంత మంది రైతులు ఓ అడ్తీదారుడి వద్దకు బుధవారం అర్ధరాత్రి సరుకులు తీసుకొచ్చారు. గురువారం ఉదయం కొంతమంది ఖరీదుదారులు ఆ సరుకు కొనుగోలుకు ముందుకొచ్చారు. తీరా సరుకు కాంటాలు ప్రారంభమయ్యే సమయానికి సదరు ఖరీదు దారులు కనిపించకపోవడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. అయితే, ఆ అడ్తీదారుడి సరుకులు కొనుగోలు చేయొద్దని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు ఖరీదుదారులకు ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సదరు రైతులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, తమ బాస్‌ అందుబాటులో లేడని నిర్లక్ష్యపు సమాధానమిచ్చినట్లు తెలిసింది. అడ్తీదారుడితో చాంబర్‌కు ఏమైనా వివాదాలు ఉంటే వారువారు చూసుకోవాలే గానీ, రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. ఇక చేసేది ఏమీలేక రైతులు మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజ్ కి పంపించారు. దీని పై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారు ? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.



Next Story