భూ‌కబ్జాదారుల చేతుల్లో అంతర్థానం కానున్న గోపాలపురం చెరువు

by Dishaweb |
భూ‌కబ్జాదారుల చేతుల్లో అంతర్థానం కానున్న గోపాలపురం చెరువు
X

దిశ,హనుమకొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రం వస్తే చారిత్రాత్మక వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ తర్వాత అంతటి నగరం అవుతుందని, ఎయిర్పోర్ట్, ఫ్లైఓవర్లు, పరిశ్రమలను ఎన్నెన్నో ఊహించుకొని ఉద్యమకారులను గెలిపిస్తే, ఏడేండ్ల నుంచి వరంగల్ మహానగరం పరిస్థితి ఎక్కడవేసిన గొంగలి అక్కడనే ఉన్నదని గోపాలపురం వాసులు వాపోతున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల నగర అభివృద్ధికి ఒక పద్ధతి ప్రణాళిక అంటూ ఏమిలేదు. కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తున్న నిధులు, ప్రజలు కడుతున్న పన్నులతో ఎక్కడ అభివృద్ధి చేస్తున్నరో గానీ, గత ఏడేళ్ల నుంచి అభివృద్ధి శూన్యం మని ప్రజలు వాపోతున్నారు.

కాకతీయుల కాలం నుంచి ఉన్న, కాకతీయ రాజులు తవ్వించిన నగరంలోని చెరువులు ఈ ఏడేళ్ల లో పదుల సంఖ్యలో మాయమయ్యాయి. వీటిని భూ కబ్జాదారులు, దళారులు దర్జాగా వందల ఎకరాల చెరువుల భూముల్ని ఆక్రమించుకొని కోట్లకు పడగలెత్తి రాజకీయ నాయకుల అండదండలతో బుసకొడుతుంటే సామాన్య ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతోందని పలువురు ఎలుగెత్తి నిరసనలు వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వారికి కొమ్ము కాస్తుంది. ఇదే కోవలో కబ్జాకు గురైన వాటిలో హనుమకొండ నగరంలోని నడిబొడ్డున వున్న గోపాలపురం చెరువు ఒకటి. ఈ చెరువు 56వ. డివిజన్ పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఉంది.

రెవెన్యూ రికార్డుల్లో చెరువు శిఖం భూమి సర్వే నెం.89 లో 23.1 ఎకరాలు...

రెవెన్యూ రికార్డుల ప్రకారంగా చెరువు శిఖం భూమి సర్వే నెం.89 లో 23.1 ఎకరములు ఉన్నట్లు రికార్డు ల్లో ఉందని గ్రామస్తులు తెలిపారు. గోపాలపురం ఊర చెరువులో 3.5 మైక్రో ఫీట్ మిలియన్ క్యూబిక్ ఫీట్ లో నీరు ఉండే సామర్థ్యం 1 మైక్రో ఫీట్=1000000 వందల ఎకరాల పంటలకు నీరందించేదని, కానీ ఇప్పుడు గోపాలపురం చెరువు ధ్వంసం కావడంతో పొలాలు పూర్తిగా ఎండిపోయాయ ని సమీపంలోని వ్యవసాయ రైతులు తెలిపారు. ఇప్పుడు చూస్తే గోపాలపురం చెరువు 10 ఎకరాలకు మించిలేదు. రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల రోజురోజుకూ చెరువు ప్రాంతం అన్యాక్రాంతం అవుతుందని, ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ తరహాలో శిల్పారామం లాగా అభివృద్ధి చేస్తామని గోపాలపురం చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మహానగరానికి ఒక కొత్త శోభను అలంకరింపచేస్తామని ఎమ్మెల్యేలు ప్రకటించి శంకుస్థాపనలు చేసి సంవత్సరాలు గడిచాయని. శిలాఫలకం, సైను బోర్డులు మాత్రమే మిగిలాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్ల విలువచేసే భూమిలో శిల్పారామం తరహా ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ఇష్టం లేని రాజకీయ భూ బకాసురులు దానిని తరలించేవరకు నిద్రపోలేదు.

ఆఖరికి చెరువు కట్టను దంపుయార్డుగా మార్చి చెరువు కట్టపైన శవాల దహన సంస్కారాలు చేస్తున్నారు. చెరువు కట్టపైన సమాధులు నిర్మిస్తున్నారు. ప్రత్యామ్నాయ స్మశానవాటిక ఏర్పాటు చేయకుండా కావాలని నిర్లక్ష్యం చేయడంవల్లనే ఈ పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు తెలిపారు. చెరువులోకి డ్రైనేజి మురికినీరు వదిలేసరికి, మురికి నీరు నిలిచిపోవడంతో భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయని సమీపంలోని కాలనీ వాసులు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ చెరువు పరిసరాలు తమ ఆధీనంలో ఉన్నాయని ఎలాంటి ఆక్రమణలకు పాల్పడ్డ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు చెరువు కట్టకు ఇరువైపుల ఏర్పాటు చేసి అప్పటి జిల్లా కలెక్టర్ చెరువు శిఖం భూమిని, చెరువు కట్టను సర్వే చేయించి సరిహద్దులు ఏర్పాటు చేయించినారు. కానీ ఏమైందో ఏమో ట్యాంక్ బండ్ ప్రక్రియ ఆగిపోయింది. చెరువు కట్టని సుందరీకరణ చేస్తే అక్రమాలు ఆగి పోతాయని సూచించారు.

కబ్జాల ఫలితమే కాలనీల ముంపు..

ఆక్రమణకు గురైన నాలాను ఇప్పటికి పునరుద్ధరించే పనిని చేపట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నది. 100 ఫీట్ల రోడ్డును నిర్మించారు కాని ఆ రోడ్డువెంట ఇరువైపుల 100 ఫీట్లతో వరద మరియు డ్రైనేజి నీరు తరలింపుకు మున్సిపల్ అధికారులు సరైన ప్రణాళికలు చర్యలు తీసుకోలేదు,చేపట్లేదు గోపాలపురం చెరువు కట్ట ప్రస్తుతం మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి సామాన్య ప్రజలు అటువైపు వెళ్లాలంటే భయానక వాతావరణం నెలకొందని అనేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలంలో చెరువు నిండి పోయి అలుగు దుంకిన నీటికి సరైన నాలా వ్యవస్థ లేకపోవడం వల్ల ఉధృతమైన వరద ధాటికి 100ఫీట్ రోడ్డు ప్రధాన రోడ్డు మార్గం కొట్టుకు పోవడం జరిగింది. పటిష్టమైన ప్రణాళిక లేకుండా పోయింది. చెరువు నుండి బయటకు వచ్చే నీళ్లకు సరైన నాలా మార్గం లేక అలుగుకు అతి సమీపంలోనే అడ్డుగా సబ్ స్టేషన్ కాంపౌండ్ ఉండడం వల్ల చేరువు నుండి వచ్చే నీళ్లు మెయిన్ 100ఫీట్ రోడ్ నాలా కు వెళ్లుతాయని తెలిపారు. మిషన్ భగీరథ గోపాలపురం చెరువుకు వర్తించదా.. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని గోపాలపురం చెరువు ముంపు ప్రాంతం కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ/జిల్లా కలెక్టర్, వరంగల్ మున్సిపల్ కమీషనర్ లు చెరువు పరిసరాలు సందర్శించాలని కోరారు.

గోపాలపురం చెరువును మిని ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయాలి. గోపాలపురం చెరువు నుండి 100 ఫీట్ల రోడ్కు రెండువైపులా వరద కాలువ/రిటెయినింగ్ వాల్ నిర్మించాలి. చెరువు చుట్టూరా బతుకమ్మ ప్రాంగణం ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టాలని, గోపాలపురం చెరువు శిఖం భూమిలో చెరువు హద్దులు నాటి చెరువు కట్ట ధ్వంసం చేయకుండా చర్యలని, చెరువు రక్షణ కోసం భూ రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని హనుమకొండ వంద ఫీట్ల రోడ్ కాలనీల అభివృద్ధి కమిటీల ఐక్య కార్యాచరణ సమితి" (ఐ.కా.స) తరఫున కన్వీనర్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed