అకాల వర్షాలతో రైతులు ఆగమాగం..

by Disha Web Desk 23 |
అకాల వర్షాలతో రైతులు ఆగమాగం..
X

దిశ,ఏటూరునాగారం:మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుండి కురిసిన వర్షం అన్నదాతను ఆగం చేసింది. అకాల వర్షం కురవడంతో మండలంలోని వరి, మిర్చి సాగు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని ఆయా గ్రామాలలో సగం వరకు వరి కోతలు పూర్తయ్యి, మిగతావి కోతకు వచ్చి ఉన్నాయి. ఇలాంటి సమయంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షానికి వరి సాగు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షం పడుతుండడంతో ఆరుగాలం కష్టించిన పంట అమ్ముకోవడం కోసం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకు వచ్చిన ధాన్యం వర్షానికి తడవకుండా ఉండడం కోసం ధాన్యంపై టార్పాలిన్లు కప్పినప్పటికి కొంత మేర ధాన్యం తడిచింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవటంతో కొనుగోలు కేంద్రాలలోని చాలా మంది రైతులకు చెందిన ధాన్యం తడుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిరప పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మిరప పంట పూత, కాపు దశలలో ఉంది. ఈ దశలో వర్షం పడుతుండడంతో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని మిరప సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావం రెండు రోజుల పాటు తీవ్రంగా ఉంటుందని, ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో మండలంలోని రైతులు ఆందోళన మరింత చెందుతున్నారు.

Next Story