డాక్టర్లమని చెప్పి నిలువునా దోచేశారు

by Dishafeatures2 |
డాక్టర్లమని చెప్పి నిలువునా దోచేశారు
X

దిశ, గూడూరు : వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు సదరం క్యాంపు సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కక్కరి దగ్గర రెండు వందల రూపాయలు వసూలు చేసిన నకిలీ డాక్టర్లు. ఈ ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లోని పోనుగోడు రాములు తండా, చిర్రకుంట తండలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ వారం రాత్రి నకిలీ డాక్టర్లు గ్రామంలో తిరుగుతూ.. ఆధార్ కార్డ్, రేషన్ కార్డుతో పాటు రెండు వందల రూపాయలు తీసుకుని పోనుగోడు గ్రామ పంచాయతీకి రావాలని గ్రామంలో డప్పు చాటింపు చేయించారు. ఇది నమ్మిన గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీకి పరుగులు తీశారు. నకిలీ డాక్టర్ల మాటలు నమ్మిన గ్రామంలోని వికలాంగులు, వృద్ధులు.. పెన్షన్ వస్తుందనే ఆశతో రెండు వందల నుండి ఐదు వందల వరకూ డబ్బులు ముట్టజెప్పారు.


కొంత మంది గ్రామస్థులు వారిని గమనించి సదరం క్యాంపు గురించి గూడూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించగా.. గూడూరు వైద్య శాఖ అధికారులు స్పందించి సదరం క్యాంపు ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. గ్రామస్థులు వారిని నిలదియగా తాము వరంగల్ ఎంజీఎం నుండి వచ్చిన స్పెషల్ డాక్టర్లమంటూ నమ్మబలికారు. కానీ గ్రామస్థులు అందరూ కలసి ఎదురు తిరగడంతో ఇద్దరు నకిలీ డాక్టర్లు అక్కడి నుండి డబ్బులు వసూలు చేసుకొని పరారయ్యారు. ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.


Next Story

Most Viewed