చెట్లు కూలడానికి భూకంపానికి ఎలాంటి సంబంధం లేదు : జిల్లా కలెక్టర్

by Kalyani |
చెట్లు కూలడానికి భూకంపానికి ఎలాంటి సంబంధం లేదు : జిల్లా కలెక్టర్
X

దిశ, ములుగు ప్రతినిధి: సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే బుధవారం ఉదయం సంభవించిన భూకంపంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. బుధవారం సాయంకాలం తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క- సారలమ్మ తల్లులను జిల్లా కలెక్టర్ దివాకర దర్శించుకున్నారు. అనంతరం మేడారంలోని అమ్మవార్ల పూజారులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నోడు కారణంగా వేలాది చెట్లు నేలమట్టం కావడానికి ఈరోజు ఉదయం జరిగిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూమిలో జరిగిన కొన్ని చర్యల వలన భూకంపం వస్తుందని, భూమిపైన జరిగిన కొన్ని చర్యల వలన చెట్లు కూలిపోతాయని తెలిపారు.

రెండు సంఘటనలు ములుగు జిల్లాలోని జరగడంతో జిల్లా ప్రజల ఆందోళన చెందుతున్నారని ఇలాంటి సంఘటన జరగడం సహజమని అన్నారు. బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాల సమయం లో 6 సెకండ్ల నుంచి 8 సెకండ్ల మధ్యన భూకంపం సంభవించిందని దీంతో జిల్లాలో జరిగిన నష్టం వివరాలను తెలుసుకోవడం కోసం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు పూర్తి వివరాలను తీసుకోవడం జరిగిందని, ఒకచోట పాక్షికంగా ఇల్లు దెబ్బ తిన్నట్లు అధికారులు వివరించారని తెలిపారు. ఈరోజు ఉదయం జరిగిన సంఘటనతో తాను సైతం తన ఇంటి నుండి బయటకు వచ్చానని, ఇలాంటి సంఘటన జరిగిన సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మేడారం ఈవో రాజేందర్, అమ్మవార్ల పూజారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed