దిశ ఎఫెక్ట్... సీడ్స్ షాపుల్లో తనిఖీలు..

by Kalyani |
దిశ ఎఫెక్ట్... సీడ్స్ షాపుల్లో తనిఖీలు..
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని పరమేశ్వర సీడ్స్ సహా పలు సీడ్స్ షాపులపై నర్సంపేట వ్యవసాయ అధికారి కృష్ణ కుమార్ తన బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు. గురువారం ఉదయం మొదలు పట్టణంలోని అన్ని సీడ్స్ షాపుల స్టాక్ రిజిస్టర్లు సహా పలు రికార్డులను పరిశీలించారు. రెండు, మూడు బ్రాండెడ్ విత్తన కంపెనీలకు సంబంధించి ముందస్తు బుకింగ్ జరుగుతున్న విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రైతు కూలీ సంఘం బుధవారం ఆర్డీఓకి ఫిర్యాదు చేసిన విషయంపై ఆరా తీశారు. ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేసినట్లు తేలినా, కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు రుజువైన సదరు డీలర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులను ఉద్దేశించి ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కృష్ణ మాట్లాడుతూ... వానాకాలం 2024-25కి సంబంధించి సీజన్ ప్రారంభం అయినందున రైతులు విత్తన ప్యాకెట్లు కోసం సీడ్ షాపు నిర్వహకులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. కాగా రైతులు తొందర పడి విత్తనాలు కొని పొడి దుక్కిలో విత్తుకుంటే నష్టపోతారని సూచించారు. రుతుపవనాలు వచ్చిన తర్వాత, సరైన వర్షపాతం నమోదు అయిన తర్వాతే విత్తనాలు ఉపయోగించాలన్నారు. లాభాలు విపరీతంగా వస్తాయంటూ ప్రచారం జరుగుతున్న విత్తన కంపెనీ ప్యాకెట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతీ కొనుగోలుకు సంబంధించి రసీదు తప్పనిసరి అని గుర్తు చేశారు. పంటకాలం పూర్తయ్యే వరకు రసీదు, విత్తన సంచి భద్రపరుచుకోవాలన్నారు.

గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు విక్రయించే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆధీకృత డీలర్ల వద్దనే విత్తనాల కొనుగోలు చేయాలన్నారు. విత్తన సంచులపై లాట్ నెంబర్, డేట్ ఆఫ్ ప్యాకింగ్ తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. సీడ్ షాపుల నిర్వాహకులతో విత్తన విక్రయాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఎదురైనా వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు.

Next Story

Most Viewed