ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఎర్రంరెడ్డి.. పాలకుర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

by Satheesh |
ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఎర్రంరెడ్డి.. పాలకుర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/ తొర్రూరు: పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ నేత ఎర్రంరెడ్డి తిరుప‌తిరెడ్డిపై టీపీసీసీ నాయ‌కురాలు ఝాన్సీరెడ్డి వ‌ర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ‌య‌భేరి స‌భా వేదిక‌గా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రక‌టించిన ఆరు గ్యారంటీ స్కీంల ప్రచారాన్ని ప్రారంభించేందుకు త‌మిళ‌నాడు సీఎల్పీ నేత సెల్వ పెరంతాంగై సోమ‌వారం మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం అమ్మాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పాల‌కుర్తి నుంచి టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ స‌భ్యురాలు ఝాన్సీరెడ్డి ఆయ‌న‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు అమ్మాపురం గ్రామానికి వ‌చ్చిన మ‌రో నేత ఎర్రంరెడ్డి తిరుప‌తిరెడ్డి కూడా అక్కడ‌కు రావ‌డంతో ఝాన్సీరెడ్డి వ‌ర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా ఎర్రంరెడ్డి తిరుప‌తిరెడ్డి తీవ్ర విమ‌ర్శలు చేస్తూ వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలోనే పార్టీ అధిష్ఠానం సైతం ఆయ‌న్ను మంద‌లించిన‌ట్లుగా తెలుస్తోంది. ఝాన్సీరెడ్డికే పాల‌కుర్తి టికెట్ కేటాయింపు దాదాపుగా ఖ‌రారు చేసిన‌ట్లుగా పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈనేప‌థ్యంలో విజ‌య‌భేరి స‌భ‌లోనూ బ్రాండింగ్ క‌మిటీలో క‌న్వీన‌ర్‌గా ఆమెను నియ‌మించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. టీపీసీసీలోకి తీసుకోవ‌డం వంటి ప‌రిణామాలు పార్టీలో ఆమెకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి. ఈనేప‌థ్యంలోనే ఎర్రంరెడ్డి తిరుప‌తిరెడ్డి ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడ‌టాన్ని ఆమె వ‌ర్గీయులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఎర్రంరెడ్డి.. ఎర్రబెల్లి ఒక్కటే..!

పాల‌కుర్తి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎర్రంరెడ్డి తిరుప‌తిరెడ్డి ఒక్కటే అంటూ ఝాన్సీరెడ్డి వ‌ర్గీయులు మండిప‌డుతున్నారు. ఈ క్రమంలోనే సోమ‌వారం అమ్మాపురం గ్రామానికి వ‌చ్చిన ఆయ‌న్ను ఝ‌న్సీరెడ్డి వ‌ర్గీయులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ అమ్మాపురం ఊరి పొలిమేర దాటేంత వ‌ర‌కు ఆయ‌న్ను ఝాన్సీరెడ్డి వ‌ర్గీయులు వెంబ‌డించారు. ఎర్రంరెడ్డి.. ఎర్రబెల్లి ఒక్కటేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల‌కుర్తిలో ఎన్ని కుట్రలు ప‌న్నినా కాంగ్రెస్ అభ్యర్థిగా ఝాన్సీరెడ్డి అభ్యర్థిత్వం ఖ‌రారు కావ‌డం, విజ‌యం సాధించ‌డం ఖాయ‌మంటూ నినాదాల‌తో హోరెత్తించారు. అమ్మాపురంలో కొద్దిసేపు హై టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Next Story

Most Viewed