శివాలయ పున:ప్రతిష్ఠాపనకు పోటెత్తిన భక్తులు

by Sridhar Babu |
శివాలయ పున:ప్రతిష్ఠాపనకు పోటెత్తిన భక్తులు
X

దిశ, పర్వతగిరి : శివాలయ పున: ప్రతిష్ఠాపనకు మూడో రోజు శనివారం భక్తులు పోటెత్తారు. కాకతీయుల కళావైభవంగా విలసిల్లిన ఉమ్మడి వరంగల్ పరిధిలోని పర్వతగిరి పర్వతాల గుట్ట శివాలయంలో ఉన్న దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన పర్వతాల శివాలయం పున: ప్రతిష్ఠాపన పూజలు ఈ నెల 26వ తేదీ నుంచి భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ వాస్తు నిపుణులు నూకల నరేష్ రెడ్డి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతిష్ఠాపనకు జనగాం, వరంగల్, హనుమకొండ జిల్లాలు, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా విచ్చేసిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భక్తి, సినీ పాటల కార్యక్రమం నిర్వహించారు. సినీ గాయకులు మధుప్రియ, సునీత వివిధ పాటలు పాడారు.

ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు

పర్వతాల శివాలయం పున: ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పర్యవేక్షణ

మంత్రి స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాలగుట్టపై పర్వతాల శివాలయంలో శనివారం ఉదయం మహా శివుడు కొలువయ్యాడు. శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పూలమాలలతో అలంకరించి, పాలాభిషేకం నిర్వహించారు. దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదానంలో భక్తులతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed