హ‌న్మ‌కొండ కార్మిక‌శాఖ‌లో రాబందులు..!

by Dishanational2 |
హ‌న్మ‌కొండ కార్మిక‌శాఖ‌లో రాబందులు..!
X

శ‌వాల‌పై కాసులేరుకోవ‌డం అంటే ఇదేనేమో..! హ‌న్మ‌కొండ జిల్లా కార్మికశాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ కార్యాల‌యంలో కొంతమంది అక్రమార్కులు రాబందుల మాదిరి వ్యవహరిస్తున్నారు. చనిపోయినవారికీ లేబ‌ర్‌కార్డులు సృష్టిస్తూ బీమా సొమ్మును కాజేస్తున్నట్లు సమాచారం. ఈ స్కాం పూర్తిగా ఆ శాఖలోని ఓ ఉన్న‌తాధికారి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తీ మండ‌లంలోని ఏడెనిమిది గ్రామాల‌కు ఒక ఏజెంట్‌ను నియ‌మించుకుని మ‌రీ లేబ‌ర్ కార్డుల జారీ పేరునా బ‌డా స్కాంకు పాల్ప‌డుతున్న‌ట్లుగా సమాచారం. సాధార‌ణ మ‌ర‌ణాల‌ను కూడా ప‌ని స్థలంలో ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన‌ట్లుగా క్లైయిమ్ చేసి మరీ కమీషన్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే పాల్పడుతున్నట్లు తెలస్తోంది. ఉన్నతాధికారులు క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ దిశ‌గా విచార‌ణ చేప‌డుతారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే.


దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : శ‌వాల‌పై కాసులేరుకోవ‌డం అంటే ఇదేనేమో..! హ‌న్మ‌కొండ జిల్లా కార్మికశాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ కార్యాల‌యంలో చనిపోయినవారికి లేబ‌ర్‌కార్డులు సృష్టిస్తూ బీమా సొమ్మును కాజేస్తున్నారు. చ‌నిపోయిన వారి పేరు మీద లేబ‌ర్‌కార్డులు సృష్టించి కోట్ల‌లో స్కాంకు పాల్ప‌డిన‌ట్లుగా అత్యంత‌ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ భారీ స్కాం పూర్తిగా శాఖలోని ఓ ఉన్న‌తాధికారి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్న‌ట్లు సమాచారం. ప్ర‌తీ మండ‌లంలోని ఏడెనిమిది గ్రామాల‌కు ఒక ఏజెంట్‌ను నియ‌మించుకుని మ‌రీ లేబ‌ర్ కార్డుల జారీ పేరునా బ‌డా స్కాంల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. సాధార‌ణ మ‌ర‌ణాల‌ను కూడా ప‌ని స్థలంలో ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన‌ట్లుగా క్లైయిమ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే..

చిన్నా చిత‌క ప్రైవేటు ఆస్ప‌త్రులు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల నుంచి డెత్ స‌ర్టిఫికెట్ జారీ అయ్యేలా చేస్తున్నారు. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ నుంచి అధికారికంగా మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను పొందుతున్నారు. ముందుగానే కుద‌ర్చుకుంటున్న ఒప్పందాల ప్ర‌కారం స‌గం బీమా సొమ్ము అధికారులు, ద‌ళారుల‌కు చేరుతుండ‌గా, మిగ‌తా స‌గం సొమ్మును సంబంధిత కుటుంబానికి అంద‌జేస్తున్నారు. కొన్ని ఘ‌ట‌న‌ల్లో స‌గం కంటే త‌క్కువగా కూడా ముట్ట‌జెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అడిగే వారు లేని కుటుంబమైతే ఏకంగా ల‌క్ష వ‌ర‌కు మాత్ర‌మే చేతిలో పెట్టి ఇంతేనంటూ ద‌బాయించిన ఘ‌ట‌న‌లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటువంటి ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో భీమదేవ‌ర‌ప‌ల్లి మండ‌లంలో జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై కార్యాల‌యంలో అధికారుల‌కు ఫిర్యాదులు అందినా త‌మ భండారం బ‌య‌ట ప‌డ‌కుండా అధికారులు ఎంతోకొంత మొత్తం మ‌ళ్లీ సంబంధిత కుటుంబానికి అంద‌జేసి విష‌యం బ‌య‌ట‌కు రాకుండా చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

విచారిస్తే మరిన్ని వెలుగులోకి..

జిల్లాలో ఇప్పటి వరకు వ‌చ్చిన దరఖాస్తులు, వాటిలో ఎన్ని దరఖాస్తులకు ప్రతిపాదనలు పంపించారు? ఎన్ని మంజూర‌య్యాయి? ఎంత‌మందికి బీమాతోపాటు సంక్షేమ పథకాల సొమ్ము అందించారు? ఎంత‌మంది ద‌ర‌ఖాస్తులను తిర‌స్క‌రించారు? అనే విష‌యాల‌పై అధికారులు రికార్డుల‌ను ప‌రిశీలించి, క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపితే మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రానుంది. మ‌రి ఉన్న‌తాధికారులు ఆ దిశ‌గా విచార‌ణ చేప‌డుతారో లేదో వేచి చూడాలి.

ఇదీ ప‌థ‌కం తీరు..

నిర్మాణ, భవన, రోడ్డు నిర్మాణ కార్మికులు, మట్టి పని, ఫ్లోరింగ్‌ పనిచేసేవారు, రాడ్డు బైండింగ్‌, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటింగ్‌, పొక్లెయిన్‌ కార్మికులు, ఇటుక బట్టీలో పనిచేసేవారు, క్వారీ కార్మికులు లేబ‌ర్ కార్డు పొందేందుకు అర్హులు. అర్హులైన వారంతా కార్మిక శాఖ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు పెట్టుకుని రూ.110తో చెల్లిస్తే ప‌రిశీల‌న చేసి లేబ‌ర్ కార్డు అంద‌జేస్తారు. అయిదేళ్లపాటు సభ్యుడిగా కొనసాగవచ్చు. నెలకు రూ.1చొప్పున ఏడాదికి రూ.12 చెల్లించి రెన్యువల్‌ చేసుకోవచ్చు. సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోకపోతే రాయితీలు వర్తించవు. కార్మికుడిగా పేరు నమోదు చేయించుకున్న వారికి పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6.30లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.4లక్షలు వర్తిస్తుంది. సాధారణ మరణమైతే రూ.1.30 లక్షలు, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు 50శాతం అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.4లక్షల పరిహారం వర్తిస్తుంది. కార్మికుడు పని ప్రదేశంలో చనిపోతే అంత్యక్రియల నిమిత్తం రూ.30వేలు మృతుడి కుటుంబానికి అందిస్తారు. కార్మికురాలు, కార్మికుడి భార్య, లేదా ఇద్దరు బిడ్డలకు ఈ సదుపాయం ఉంది. ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో కాన్పు అయితే రూ.30వేలు ఇస్తారు. ఈ సదుపాయం రెండు కాన్పుల వరకు వర్తిస్తుంది. ముందుగా కార్మిక శాఖలో పేరు నమోదు చేయించుకోవాలి. ఈ పథకం కింద రిజిస్టర్‌ అయిన అవివాహిత మహిళా కార్మికురాలు, కార్మికుడి ఇద్దరు కుమార్తెలకు ఈ పథకం వర్తిస్తుంది. కార్మికుడి కుమార్తె వివాహ సమయంలో రూ.30వేలు ఆర్థిక సాయం అందుతుంది. పెళ్లి, వయస్సు, ధ్రువీకరణ పత్రం, ఫొటో, వివాహ ధ్రువీకరణ పత్రం సహాయ కార్మిక అధికారికి అందజేస్తే ఈ నగదు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందించినప్పటికీ కార్మికులకు ఈ పథకం ద్వారా అదనంగా అందిస్తారు. భవన నిర్మాణ రంగ, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న 18సంవత్సరాల నుంచి 60సంవత్సరాలలోపు వయసు కలిగిన కార్మికులు మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవ‌చ్చు.


Next Story

Most Viewed