బీఆర్ఎస్‌లో ''తోటి కోడళ్ల'' మధ్య భగ్గుమన్న వర్గపోరు.. పంచాయతీ కార్యాలయంలోనే సిగపట్లు!

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌లో తోటి కోడళ్ల మధ్య భగ్గుమన్న వర్గపోరు.. పంచాయతీ కార్యాలయంలోనే సిగపట్లు!
X

దిశ, జనగామ: జనగామ జిల్లా లింగాలగణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ చిట్ల స్వరూప రాణి, ఎంపీపీ చిట్ల జయశ్రీలు గ్రామ పంచాయతీ పాలకమండలి సాక్షిగా మంగళవారం సిగపట్లు పట్టుకున్నారు. దీంతో ఈ పంచాయతీ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ బీఆర్ఎస్ లీడర్లే. స్వరూప రాణి నెల్లుట్ల గ్రామ సర్పంచ్ కాగా, జయశ్రీ అదే గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్వయానా వీరిద్దరూ తోడికోడళ్ళు. నెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ స్వరూప రాణి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం గ్రామ పాలకమండలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ హాజరు కాగా తోడికోడళ్లు ఇద్దరి మధ్య స్థానిక అభివృద్ధి విషయమై మాటల యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి వారు గ్రామ అభివృద్ధిలో తన పాత్ర ఉందంటూ చెప్పుకున్నారు.

ఈ క్రమంలో ఎంపీపీ తానే అభివృద్ధికి అధికంగా కృషి చేశానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అధ్యక్షత స్థానంలో ఉన్న గ్రామ సర్పంచ్ తానే గ్రామాభివృద్ధికి పాటుపడ్డాను, ఇందులో ఎవరు పైసా ఇవ్వలేదని సర్పంచ్ స్వరూప రాణి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఎంపీపీ, సర్పంచ్ మధ్య చెలరేగిన మాటల తూటాలు సిగపట్ల వరకు వెళ్ళింది. పక్క పక్కనే వేదిక మీద ఉన్న ఇద్దరు ఒకరుపై మరొకరు క్షణంలో దాడి, ప్రతిదాడికి పూనుకున్నారు. చేతులు పట్టి నెట్టేసుకున్నారు.

ఆ సమయంలో అక్కడున్న వార్డు సభ్యులు, గ్రామస్తులు వారిద్దరిని వారించే ప్రయత్నం చేశారు. ఈ గొడవతో సమావేశం కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. అనంతరం ఎంపీపీ జయ శ్రీ గ్రామ సర్పంచ్ స్వరూప రాణిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సర్పంచ్ స్వరూపరానిపై ఐపీసీ 294-బి,323,506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ స్వరూపరాణి కూడా ఎంపీపీ జయశ్రీ పై పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

కలెక్టర్, జేసీలకు పరస్పర ఫిర్యాదులు:

ఈ పంచాయతీ అనంతరం ఎంపీపీ చిట్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్యను కలిసి సర్పంచ్ స్వరూపరాణిపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సర్పంచ్ స్వరూపారాణి కూడా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయిని కలిసి ఎంపీపీపై ప్రతి ఫిర్యాదు చేశారు.

ఇద్దరూ బీఆర్ఎస్ లీడర్లే:

నెల్లుట్ల గ్రామ సర్పంచ్ స్వరూప రాణి, లింగాల గణపురం ఎంపీపీ జయశ్రీలు ఇద్దరూ స్వయానా తోడికోడలళ్లే కాకుండా బీఆర్ఎస్ లీడర్లు. వీరిద్దరికి మధ్య మొదటి నుండి ఉప్పు నిప్పులాగే ఉండేది. వీరి ఇరువురిలో సర్పంచ్ కుటుంబంలో పెద్ద కోడలు కాగా, ఎంపీపీ చిన్న కోడలు. అయితే వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. అయితే సర్పంచ్ కడియం శ్రీహరి వర్గం కాగా, ఎంపీపీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గం. వీరిద్దరిది కుటుంబ అని కొందరురంటుండగా.. కాదు కాదు ఇది బీఆర్ఎస్ లోని వర్గ పోరు అని మరికొందరు చెపుతున్నారు. ఏది ఏమైనా వీరు ఇరువురు పాలకమండలి సాక్షిగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కీచులాడుకుని రచ్చకెక్కడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. మరీ బీఆర్ఎస్ లీడర్లు, కడియం శ్రీహరి, కొండ రాజయ్యలు ఈ పంచాయతీని ఏం చేస్తారో వేచి చూడాలి.


Next Story