ఉత్కంఠ రేపుతోన్న మునుగోడు సభ.. అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి మరో నేత?

by Dishanational2 |
ఉత్కంఠ రేపుతోన్న మునుగోడు సభ.. అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి మరో నేత?
X

దిశ, భీమదేవరపల్లి: కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతూ కష్టకాలంలో కూడా పార్టీకి కార్యకర్తలకి అండగా ఉంటూ తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చిన బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఒక్కసారిగా అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగస్టు 21న మునుగోడులో జరగబోయే బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభలో అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నాడని సంకేతాలు బొమ్మ వర్గీయుల నుండి అందుతున్నాయి. గత కొన్ని రోజులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌తో మంతనాలు జరుపుతున్న బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈనెల 21వ తేదీన మునుగోడులో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కష్టకాలంలో పార్టీకి తోడుగా బొమ్మ

కాంగ్రెస్ పార్టీ నుండి అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి వెళ్లిన తరువాత, కాంగ్రెస్ పార్టీకి హుస్నాబాద్‌లో చోటు లేకుండా పోయిన తరుణంలో పార్టీ ఒక్కసారిగా కనుమరుగయ్యే స్థాయిలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియోజకవర్గ పగ్గాలు చేత భూనీ కష్టకాలంలో ఉన్న పార్టీని గట్టెక్కించారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని పార్టీని నిలబెట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గస్థాయిలో గతంలో లేనివిధంగా సుమారు 35వేల సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత బొమ్మకే దక్కింది. నియోజకవర్గ స్థాయిలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తన స్థానాన్ని కాపాడుకుంటూనే కార్యకర్తలకు అండగా నిలిచారు.

ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన బొమ్మ కుటుంబం

బొమ్మ వెంకన్న తన జీవితకాలం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితం చేశారు. తండ్రి అడుగుజాడల్లోనే తాను కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ సేవలు అందించారు. దాదాపు 5 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే బొమ్మ కుటుంబం కొనసాగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఐదు దశాబ్దాల చరిత్రకి బొమ్మ శ్రీరామ్ స్వస్తి పలికి బీజేపీ కండువా కప్పుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పొన్నం పాదయాత్రకి ఎలాంటి ఆహ్వానం అందలేదు

కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇటీవల చేపట్టిన పాదయాత్ర గూర్చి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తనకు కరోనా రావడం వల్లనే పాదయాత్రకి దూరంగా ఉన్నానని పొన్నం ప్రభాకర్ చెప్పడం విడ్డూరంగా ఉందని బొమ్మ అన్నారు. నేటితో ఎలుకతుర్తి మండలంలో ముగుస్తున్న పొన్నం పాదయాత్రకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు. చివరగా బొమ్మ శ్రీరాం చక్రవర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కల్పించడం లేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా బొమ్మ శ్రీరాం చక్రవర్తి తన వర్గంతో మునుగోడు వేదికగా బీజేపీలోకి చేరుతున్నారని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

హుస్నాబాద్ నుండి బీజేపీ నుంచి బరిలో బొమ్మ దిగనున్నాడా..?

బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బీజేపీ పార్టీలో చేరుతున్న తరుణంలో, హుస్నాబాద్ నుండి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో భీమదేవరపల్లి, ఎలుకతుర్తి మండలాల్లో సైతం బొమ్మ అనుచరులు ఉండడంతో ఈ రెండు మండలాల్లో బీజేపీకి బలం చేకూరుతుందని చెప్పొచ్చు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల నుండి బొమ్మ వర్గీయులుగా ఎవరు కొనసాగుతారో వేచి చూడాల్సిందే. బీజేపీ పార్టీ నుండి హుస్నాబాద్ బరిలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పోటీ చేస్తే బొమ్మ గెలుపు ఖాయమని బొమ్మ వర్గీయులు చర్చించుకుంటున్నారు.


Next Story