'ఇది బంగారు తెలంగాణ బడ్జెట్ కాదు.. ఇది బడాయి బాకీల బడ్జెట్'

by Disha Web Desk 13 |
ఇది బంగారు తెలంగాణ బడ్జెట్ కాదు.. ఇది బడాయి బాకీల బడ్జెట్
X

దిశ, కేయూ క్యాంపస్: ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇది బంగారు తెలంగాణ బడ్జెట్ కాదు.. ఇది బడాయి, బాకీల, బకాయిల బడ్జెట్ అని మండిపడ్డాడు. విద్య- వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది కేవలం 6.5% మాత్రమే, అన్ని రాష్ట్రాల్లో 15.2% ఖర్చు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇది చాలనట్టు ఈ సారి రూ.43 వేల కోట్లు అప్పులు తెస్తున్నారు. అసలు వీళ్ళు అప్పులు చేసి ఇప్పటివరకు ఏ ఆస్తులు నిర్మాణం చేశారో చెప్పండని ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ శాఖల్లో పేరుకు పోయిన రూ. 50 వేల కోట్లకు పైగా బకాలను ఎలా చెల్లిస్తారో ప్రజలకు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు బడ్జెట్ లో పెడితే 105 ఖర్చు పెడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా కాదు కనీసం 65 కూడా ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌కు ప్రాధాన్యత లేదు.

నిరుద్యోగ భృతి ఇస్తామని 4 ఏళ్ల నుంచి బుకాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ బృతి ఊసే ఎత్తకండా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. రైతుల రుణమాఫీ కీ సరిపోయే డబ్బులు ఇవ్వకుండా రైతులను ఈసారి కూడా మోసం చేశారు. ఖాళీ జాగా ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తాం అంటున్నారు. 3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మాణం సాధ్యం అవుతుందా.? అని ఆయన ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాలు సైతం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే ధనిక రాష్ట్రమైన మన రాష్ట్రం ఎందుకు ఖర్చు చెయ్యలేకపోతుంది. నిధుల కేటాయింపు, పాలసీలను వివరించకుండా చర్చ జరపకుండా, కేంద్రాన్ని విమర్శించడం మొదలు పెట్టారు.


Next Story