నరకం కనిపిస్తున్నా కనికరం చూపరా...?

by Dishanational1 |
నరకం కనిపిస్తున్నా కనికరం చూపరా...?
X

దిశ, మల్హర్: డబుల్ బీట్ రోడ్డును ధ్వంసం చేశారు. మట్టి రోడ్డు వేశారు. చినుకు పడితే చిత్తడి నరకంగా మారిన ప్రయాణం. ఇది భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల మానేరు నది రోడ్డు పరిస్థితి. కలెక్టర్ సార్ మా మోరా వినరా? మాకు రోడ్డు సౌకర్యం కల్పించరా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిచెర్ల ఉపరితల గనుల్లో బొగ్గు వెలికి తీసే ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వం నిర్మించిన మానేరు నది నుండి తాడిచెర్ల వరకు రెండున్నర కిలోమీటర్లు ఉన్న డబుల్ బీటీ రోడ్డును ధ్వంసం చేశారు. ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ నిర్మించిన మట్టి రోడ్డు చినుకు పడితే చాలు బురద మాయంగా మారి ప్రయాణికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు ప్రయాణం నరకంగా మారుతున్నా పట్టించుకునే నాథుడు లేడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 26న పరిశీలించి జూన్ 15 కల్లా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించి మూడు నెలలు దాటినా ఇప్పటివరకు రోడ్డు పూర్తి చేయడంలో నిర్లక్ష్య వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి మానేరు నదిపై బ్రిడ్జి పనులు పూర్తయి రెండు నెలలు అయినా తాడిచర్ల వరకు రోడ్డు నిర్మాణం చేయడంలో ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ప్రతినిధుల ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పొలం పనులకు వెళ్లాలన్నా.. మంథని, పెద్దపల్లి జిల్లా పట్టణాలకు వెళ్లాలన్న బురదమయంగా మారిన రోడ్డుపై ప్రయాణం ప్రాణాపాయ స్థితిలో ప్రమాదకరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి రోడ్డు పనుల్లో అలసత్వం వహిస్తున్న ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థతో అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కైనట్లు ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ఆడిందే ఆట పాడిందే పాటకు జిల్లా కలెక్టర్ మౌనంగా వ్యవహరించడం గమనార్హం.

Next Story