- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
చెరువు చివర కబ్జాల జాతర..విచ్చలవిడిగా ఆక్రమణదారుల ఆగడాలు

దిశ, వరంగల్ టౌన్ : చెరువు చివర.. కబ్జాల జాతరకు నెలవుగా మారుతున్నాయి. వరంగల్ మహానగరంలో ఇప్పటికే ప్రధాన జలాశయాలు ఆక్రమణల చెరలో కుచించుకుపోయాయి. తాజాగా చిన్నచిన్న చెరువులు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం చెరువు భూముల పరిరక్షణకు చట్టం రూపొందించి చర్యలు చేపడుతుంటే.. మరోపక్క కబ్జాల పర్వానికి అధికారులు అడ్డుకట్ట వేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు.
దేశాయిపేట చెరువులో నిర్మాణాలు..
గతంలో దేశాయిపేట చెరువు శిఖం భూముల్లో పేదలు కొందరు గుడిసెలు వేశారు. వాటిని అధికారులు తొలగించారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కబ్జాదారులు తాజాగా పడగ విప్పారు. కాశీబుగ్గ ప్రాంతంలో బతుకమ్మ బండ వద్ద ఆక్రమణల పర్వానికి తెర తీశారు. గతంలో కూడా ఇక్కడ కబ్జాలకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. మళ్లీ ఇటీవల కొందరు మట్టి పోశారు. దాదాపు మూడు నెలల తర్వాత తాజాగా నిర్మాణాలకు సిద్ధమయ్యారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదే ఏరియాలో చెరువుకు మరోవైపు పిచ్చిమొక్కల మాటున మట్టి కుప్పలు పోశారు. నేడో రేపో ఆ ప్రాంతంలోనూ నిర్మాణాలు చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
మట్టి కుప్పలే కదా అనుకుంటే!
కబ్జాదారులు మితిమీరిన ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట చెరువుల చివరి ప్రాంతాల్లో మట్టికుప్పలు, ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారు. కొంతకాలం వ్యాపారం చేస్తున్నట్లుగా నటిస్తున్నారు. ఆ తర్వాత చిన్నగా నిర్మాణాలు చేపడుతూ ఆ స్థలాలను తమ సొంతం చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లకు కట్టినట్లుగా జరుగుతున్న మూడు శాఖల అధికారుల్లో ఒక్కరికి కూడా చీమకుట్టినట్లుగా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
బల్దియా అధికారుల చేతివాటమే..!
ఆక్రమణల పర్వానికి ఆజ్యం పోస్తున్నది వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులే అన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ ఆక్రమణలకు వంతపాడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎవరైనా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే ప్రధానంగా బల్దియా అధికారులు ఆ స్థలాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఆ తర్వాత దస్తావేజులు, ఇతర డాక్యుమెంట్లు సరిచూసి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. కానీ, బల్దియా అధికారులు కేవలం మామూళ్లకు అలవాటు పడి సెటిల్‌మెంట్ చేసుకుని అనుమతులు ఇస్తున్నట్లు చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసిన వారికి వాటా ధనం ముడుతుండడంతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మూడు శాఖల కళ్లు కప్పి..!
కాశీబుగ్గ ఎనుమాముల ప్రధాన రహదారిని ఆనుకుని అడుగుల దూరంలో చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు సాగుతున్నా అటు బల్దియా, ఇటు నీటిపారుదల, అలాగే రెవెన్యూ శాఖలు పసిగట్టలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం బల్దియా అధికారులు ఉదయం వేళ నగరం వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల నిర్వహణపై పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తుంటారు. దేశాయిపేట చెరువు భూముల్లో మట్టికుప్పలు, నిర్మాణాలు వారి కంట పడకపోవడం విచిత్రమే మరి. ఇక నీటిపారుదల, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వ, చెరువు శిఖం భూముల పరిరక్షణను ఏనాడో గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆఫీసుకే పరిమితమై అధికారిక పత్రాల సంతకాలు చేయడం మినహా సర్కారు భూములు ఎక్కడ ఉన్నాయి..? చెరువుల భూములు ఎన్ని ఉన్నాయి? వాటికి హద్దులు నిర్దారించడమో, ప్రభుత్వ భూములని హెచ్చరిక బోర్డులు పెట్టడమో చేసేందుకు చేతులు రాక చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా దేశాయిపేట చెరువు శిఖంభూముల్లో ఆక్రమణలను అడ్డుకుంటారో లేదో వేచి చూడాలి.