నామినేషన్లకు సర్వం సిద్ధం : కలెక్టర్

by Disha Web Desk 23 |
నామినేషన్లకు సర్వం సిద్ధం : కలెక్టర్
X

దిశ,జనగామ: నేటి నుంచి 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించ నున్నందున ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తెలిపారు. గురువారం డీసీపీ సీతారాం తో కలిసి ఆయన జనగాం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనగామ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను, నామినేషన్ ఫారాలు, అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించాల్సిన ధ్రువపత్రాలు,ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి పాటించాల్సిన నియమ,నిబంధనలు, హెల్ప్ డెస్క్,ఆన్లైన్ నామినేషన్ల స్వీకరణ వివరాలు,తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ వివిధ అంశాలపై వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. నామినేషన్లపై నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అన్ని విషయాలను వివరించింది, లేనిది అడిగి తెలుసుకున్నారు. అంతేకాక నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు,ప్రతిపాదకులు, ఇతరుల కోసం సౌకర్యాలు,తాగునీరు, కుర్చీలు,టెంట్ ఇతర ఏర్పాట్లను చేయాలని ,ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లను స్వీకరించాలని ,అభ్యర్థులు నామినేషన్ల సమర్పించే సమయంలో వారికి ఏదైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేయడంతో పాటు, ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్లు సమర్పించే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆర్ఓ గదితో పాటు, హెల్ప్ డెస్క్, సమావేశం గది,సహాయ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గదిని, రికార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట జనగామ రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ తో పాటు, ఎన్నికల నోడల్ ఆఫీసర్స్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇస్మాయిల్, జడ్పీ సీఈవో అనిల్ కుమార్, డీఏవో వినోద్ కుమార్, తహసీల్దార్, మహిపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed