Kakatiya University ప్రతిష్ఠకు మకిలీ పట్టిస్తున్న "కాలకేయుడు"

by Disha Web Desk 12 |
Kakatiya University ప్రతిష్ఠకు మకిలీ పట్టిస్తున్న కాలకేయుడు
X

దిశ, కేయూ క్యాంపస్: తెలంగాణలో వెనుకబడిన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం,తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ఫలితంగా ఏర్పాటు చేయబడిన కాకతీయ విశ్వవిద్యాలయం 1976లో స్థాపించబడిన నాటి నుంచి, ఇప్పటి వరకు..లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను, ఉన్నత అధికారులను, శాస్త్రవేత్తలను, ఉత్తమ పౌరులనెందరినో అందించింది. ఈ విశ్వవిద్యాలయం. గతంలో పని చేసిన అంకితభావంతో కృషి చేసిన వి.సి.ల మార్గదర్శనంలో ఇంతింతై సంఖ్యలో ప్రసిద్ధిగాంచిన కోర్సులు, హాస్టళ్లు, పీజీ సెంటర్లు, మూడు ఇంజనీరింగ్ కాలేజీలతో బహుముఖంగా విస్తరించింది. ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి అట్టడుగు వర్గాలకు చెందిన వాడని ప్రభుత్వం ప్రొఫెసర్ రమేష్ గారిని వి.సి. గా కుర్చీలో నియమించి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది. సాధక బాధకాలు తెలిసిన, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తయితే యూనివర్సిటీ విద్యార్థుల, అధ్యాపకుల సమస్యలు తీరుస్తాడని ఎంతో సంతోషించాం. స్వాగతించాం.

కానీ ఆశించిన దానికి భిన్నంగా నియామకమైన తెల్లవారి నుంచి ఈ విశ్వవిద్యాలయ పరువు, ప్రతిష్టలను మంటగలపటం ప్రారంభించారు. గతంలో ఎంతో మంది వి.సి. లు ప్రభుత్వం లోని అధికార పార్టీ అండదండలతో నియామకం అవడం చూశాం. మీరు కూడా అదే బాటలో నియామకం అయినందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఇలాంటి నియామకాలు జరగడం వ్యవస్థకున్న దురదృష్టం. గతంలో నియామకం అయిన వైస్ ఛాన్సలర్ ను సన్మానించేందుకు, వారి క్యారెక్టర్ చూసి.. ఎమ్మెల్యేలు, మంత్రులు క్యూ కట్టడం చూసి ఇక్కడి విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతరులు ఒకింత గర్వపడేవారు. దానికి భిన్నంగా ప్రస్తుత వి.సి గారే.. పూల దండలతో, పుష్పగుచ్చాలతో స్థానిక చోటా, మోటా నాయకుల చుట్టూ, వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరగడాన్ని చూసి సిగ్గు విద్యావ్యవస్థ లో ఉన్న మేధావులు సిగ్గు తో తలదించుకుంటున్నారు. విశ్వవిద్యాలయం పరువు ప్రతిష్టలను దిగజార్చే కార్యక్రమాలు వీలైనన్ని, నిరాటంకంగా, సగర్వంగా, కొనసాగిస్తున్నాడు. విసి గా పదవీ బాధ్యతలు చేపట్టిన గత ఏడాదిన్నర కాలం నుండి ఇక్కడి బలహీన, అట్టడుగు వర్గాల విద్యార్థులను చదువులకు దూరం చేయడానికి నిరంతరం కుట్ర పన్నుతున్నారు.

1500 శాతం పెరిగిన వివిధ కోర్సుల ఫీజులు..?

వచ్చీ రాగానే గత విద్యా సంవత్సరంలో రెగ్యులర్ ఆర్ట్స్ కోర్సుల (ఏ.ఏ.) ఫీజులను ఒకేసారి రూ.1000 నుండి రూ.14000 ల వరకు, సైన్స్ రెగ్యులర్ కోర్సుల ఫీజులు రూ.28,000 అంటే 100 శాతం ఫీజులను పెంచడం జరిగింది. ఎవరైనా, ఎక్కడైనా 10 శాతమో, 20 శాతమో ఫీజులు పెరగడం ప్రైవేటు కళాశాలల్లో చూశాం. ఒకేసారి 1500 ఫీజులు పెంచడం.. అది కూడా, ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఎప్పుడైనా చూశామా? ఈ విధంగా భారీగా ఫీజులు పెంచడం తో పెరిగిన ఫీజుల భారం భరించలేక పలు కోర్సులలో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోవడంతో ఆయా కోర్సుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అండర్ స్టడీస్ కోర్సు ఏకంగా మూసివేయబడింది. భూపాలపల్లి, జనగాను మహబూబాబాద్, ఖమ్మం మహిళా కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాలల్లో కొన్ని కోర్సులు మూసివేయడంతో పాటు కొన్ని పీజీ సెంటర్లు మొత్తానికి మూసివేత దిశగా పయనిస్తున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లను ప్రవేశపెట్టి ఏండ్లు గడుస్తున్నా ఒక్క సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ను కూడా రెగ్యులర్ మార్చకపోగా, పేద విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు గుంజాలనే దురాలోచనతో బిటెక్, సివిల్, ఐ.టి కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లు మార్చి ఏకంగా 70,000 రూపాయలకు ఫీజులను పెంచారు.

ఇటీవల కాలంలో అనేక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలోను 10,000 నుండి 45,000లకు పెంచితే, ప్రభుత్వ విశ్వవిద్యాలయుంలోనేమో 70,000/-ల రూపాయలు గుంజుతుండడంతో ఈ ఫీజుల భారం మోయలేక కొన్ని బీటెక్ కోర్సులు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు రెగ్యులర్ కోర్సులలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను జోడించి విద్యా వ్యాపారీకరణ ను మరింత ఉధృతం చేశాడు. ప్రభుత్వమే జీతాలిచ్చి, భవనాలు నిర్మించి, ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పించి..మిమ్మల్ని నడిపించమంటే, మీరు ప్రైవేటు కళాశాల కంటే ఎక్కువ ఫీజులను దోపిడి చేయడం ఏ సమాజశాస్త్రం నియమమో , ఏ. విద్యా వ్యాపార సూత్రమో.. విసి గారే వివరించాలి. విద్యార్థులను విద్యకు దూరం చేసే పై కుట్రలో భాగంగానే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు చెందిన క్యాంపస్ పీజీ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు హాస్టళ్లు ఇవ్వనని మొండికేయడం తో ఈ సంవత్సరం అడ్మిషన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చాలా కోర్సుల్లో 50% కూడా అడ్మిషన్ల కావడం లేదంటే విశ్వవిద్యాలయ పరిస్థితి ఎంతగా దిగజార్చాలో అర్థమవుతున్నది.

అనేక మందికి ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక ఎం.టి.ఎం. జర్నలిజం వంటి కోర్సులకు కూడా మీరు పెంచిన ఫీజుల భారం భరించలేక హాస్టళ్ల మూసివేతతో అడ్మిషన్లు లేక కోర్సులు మూసివేతగా దిశగా పయనిస్తున్నాయి. ఇరవై ఏండ్ల నుండి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులకు హాస్టళ్లలో వసతి కల్పించుకుంటూ వచ్చింది ఈ విశ్వవిద్యాలయం. మీరు విసి కాగానే 20 ఏండ్ల నుండి వచ్చిన ఈ సౌకర్యాన్ని( హాస్టళ్ళ సంఖ్య పెరిగిన కూడా) రద్దు చేయడంలో మీ ఆంతర్యం ఏమిటో మీరే చెప్పాలి. ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగం కాదా? మీరు, మీ అధికారులు హాస్టల్ వసతి కల్పించడం అనగానే అదేదో ఫ్రీగా మీవి ఇస్తున్నట్లు చులకన భావంతో మాట్లాడటం మీకు పరిపాటిగా మారింది. రూం కంటుని కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ప్రైవేటు హాస్టళ్లలో చెల్లించినట్లుగానే ప్రతి నెల బిల్లులు చెల్లిస్తున్నాం. మేము హాస్టళ్లలో ఉండకపోయినా, తిండి ఉండకపోయినా, తినకున్నా మెస్ బిల్లులు చెల్లిస్తున్నాం.

అయినా విద్యార్థులేదో ఫ్రీ గా ఉంటున్నట్లు మీ దుష్ప్రచారాలెంది.? భోజనం నాణ్యత పెంచమంటే మీ ఇంట్లో చిప్పలు కొట్లాడుతాయి. ఇక్కడికొచ్చి నాణ్యత గురించి మాట్లాడుతారా ? అంటూ కించపరిచే మాటలు మాట్లాడే అధికారుల్లారా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. న్యాక్ పేరుతో హాస్టళ్లలో రిపేరింగ్ చేస్తామని అధికారికంగా సెలవులిచ్చి.. 40 రోజులకు కూడా వసూలు చేసిన బిల్లులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో తెలుసుకునే తీరికలేని మీకు, ప్రశ్నించే విద్యార్థులు గొంతులు నొక్కడానికి సమయం చిక్కుతుంది.

రాక.. రాక.. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే సమయంలో ఎమ్మేల్యేలు కూడా ఉచిత వసతులతో కూడిన కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తుంటే, ప్రభుత్వమే లక్షలు రూపాయలు ఇచ్చి ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహించమంటే తీరిక లేని మీరు, నిరుద్యోగ విద్యార్థులను ఉద్యోగాలకు కూడా దూరం చేసే పనిలో బిజీగా గడపడం శోచనీయం. ఫీజు రియంబర్స్ మెంట్‌లు, స్కాలర్ షిప్స్ శాంక్షన్ అయినప్పటికి ఫీజులు బ్యాంక్ అకౌంట్‌లో పడితే సర్టిఫికెట్లు ఇస్తామని కోర్సులు పూర్తి అయిన విద్యార్థులను వేధిస్తూ శునకానందం పొందుతున్నారే! ఇది ఏ ప్రభుత్వ కళాశాలలో నైనా చూశామా?

పీహెచ్‌డీ కేటగిరి-1 అడ్మిషన్లలో రాత్రికి రాత్రే కొత్త రూల్స్

పిహెచ్ డి కేటగిరి-1 అడ్మిషన్ల నిబందనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే రూల్స్ మార్చి మీ అనుయాయులైన ఉన్నతోద్యుగులకు సీట్లు కేటాయించడంలో చూపిన స్పీడూ... ఏండ్లకు ఏండ్లు కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్న పరిశోధక ఆశావహ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంలో ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారో తెలియడం లేదు. ప్రయోజనాల కోసం మేర తొంబై ఎనిమిది శాతం (98%)ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు చదువుకునే ఈ విశ్వవిద్యాలయంలో రెక్కలు, ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే నిరుపేద తల్లిదండ్రులను ప్రైవేటుతో పోటీపడి జలగల్లా ఫీజులు గుంజడంలో ముందున్న మీకు, పేదింటి బిడ్డలకు చదువు చెప్పించడంలో, సమయానికి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడంలో మీ ప్రగతి శీల భావం ఏమైంది? "ప్రైవేట్ దగ్గర తాకట్టు పెట్టినారా? కొత్త నియామకాలు చేపట్టకపోగా కనీసం పార్ట్ టైమ్ నియామకాలు చేపట్టారా? అనేక విభాగాల్లో సబ్జెక్టు బోధించడానికి అధ్యాపకులు లేరనే విషయం తెల్చిన కళ్ళు లేని కబోదిలా ఎందుకు నటిస్తున్నారో తెలియడం లేదు. కానీ రెక్కాడితే డొక్కాడని మా తల్లిదండ్రులు ఉపవాసం వుండైన హాస్టల్ ఫీజులు కడతామంటే కూడా బుక్కెడు బువ్వ కు దూరం చేసి నిలువనీడ లేకుండా చేస్తూ మమ్మల్ని చదువులకు దూరం చేస్తున్న మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని సైకాలజీ లో ఏమని నిర్వచిస్తారు?.

మిమ్మల్ని గౌరవించడంలో విద్యార్థులే ముందున్నారు కానీ, విద్యార్థులను వర్గ శతృవులుగా చూస్తూ వారి విద్యకు దూరం చేయడం అభ్యంతరకరం, ఇది మీ సొంత జాగీరు కాదు మీరు జాగిర్దారు కాదు.. నిజాంనే తరిమి కొట్టిన చైతన్యం తెలంగాణ ప్రజలది, విద్యార్థులది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు ఇక్కడి విద్యార్థులు. ఈ విశ్వవిద్యాలయ పరిరక్షణ కోసం ఇక్కడి విద్యార్థులు మీ ఉడత ఊపులకు భయపడరని, ఎంతటి త్యాగానికైనా వెనకాడరనే విషయం మీకు తెలియంది కాదు. అర్హత లేకపోయినా మీకో అవకాశం వచ్చింది. చరిత్ర సృష్టిస్తారో.. చరిత్ర హీనులౌతారో మీ చేతుల్లోనే వుంది. విద్యార్థి, అధ్యాపక, అధ్యాపకేతర మేధావుల్లారా ఈ విశ్వవిద్యాలయం విద్యను పేదలకు అందకుండా చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం,మూడేండ్లకొకసారి వచ్చే విద్యా వ్యతిరేక వలస పక్షుల కబంధ హస్తాల నుండి మన యూనివర్సిటిని కాపాడుకుందాం.

రండీ... ఈ విశ్వవిద్యాలయ పరిరక్షణ ఉద్యమం లో భాగస్వాములం అవుదం..

డిమాండ్స్ (1) విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. (2) యూనివర్సిటీలోని ఎస్‌ఎఫ్‌సి కోర్సులను రెగ్యూలరైజ్ చేయాలి. (3) పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి. (4) పిహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచాలి. (5) ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ శాంక్షన్ అయి కోర్సు పూర్తి అయిన విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే సర్టిఫికెట్లను అందచేయాలి. "హాస్టల్ వసతి మా హక్కు- మీ భిక్ష కాదు" అని, విశ్వవిద్యాలయం పరిరక్షణ సమితి తరఫున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విభాగం వారు విడుదల చేసిన ఈ వినతి పత్రం యూనివర్సిటీ లోని లోపాలను స్పష్టంగా ఎత్తి చూపారు. కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో, సమర్ధవంతంగా పాలనను విద్యార్థులకు, అధ్యాపకులకు , నాన్ టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లలో విధులు ఎలా చక్కబెడతారోనని ప్రజలు, సమాజం ఎదురు చూస్తున్నారు.



Next Story

Most Viewed