మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అనుచరుడు అరెస్ట్..!

by Disha Web Desk 19 |
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అనుచరుడు అరెస్ట్..!
X

దిశ, కాటారం: మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు పోలం రాజయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింనట్లు కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాటారం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుప్పారం క్రాస్ రోడ్ వద్ద కాటారం ఎస్సై సుధాకర్ వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్న చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విచారించగా మావోయిస్టు పార్టీ అగ్ర నేత కంకణాల రాజిరెడ్డికి సహకరిస్తున్నట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుండి జిల్టెన్ స్టిక్స్, డిటోనేటర్లు, గ్రేనేడ్లు, విప్లవ సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కాగా పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన పోలం రాజయ్య 1995 మావోయిస్టు పార్టీలో చేరి.. ఆ తర్వాత 2002లో ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశం తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రాజయ్య విద్యార్థులు, ప్రజలకు సిద్ధాంతాలు బోధిస్తూ మావోయిస్టు పార్టీలో చేర్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన పోలం రాజయ్యపై వివిధ ప్రాంతాల్లో 18 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో పాటు కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు, కాటారం, కొయ్యూరు ఎస్సైలు శ్రీనివాస్, సుధాకర్, కిషోర్, సీఆర్ఫీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed