అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్‌.. మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనున్న అభ్యర్థుల భ‌విత‌వ్యం

by Vinod kumar |
అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్‌.. మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనున్న అభ్యర్థుల భ‌విత‌వ్యం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: మ‌రికొన్ని గంట‌ల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల భ‌విత‌వ్యం తేలిపోనుంది. ఈనెల 3న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో అభ్యర్థులు టెన్షన్.. టెన్షన్‌గా క‌నిపిస్తున్నారు. గెలుపు త‌మ‌దేనంటూ ధీమాను వ్యక్తం చేస్తూన్నా, ఫ‌లితం ఎలా ఉంటుందోన‌న్న భ‌యాందోళ‌న చెందుతున్నారు. 30వ తేదీన జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిపై ఇప్పటికే స‌మాచారం సేక‌రించుకుని స‌మీక్ష చేసుకున్న అభ్యర్థులు త‌మ గెలుపోట‌ముల‌పై అంచ‌నాలు వేసుకున్నారు. గెలుపు త‌న‌దేన‌ని ప్రెస్‌మీట్లు పెట్టి గాంభీర్యాన్ని ప్రద‌ర్శించిన అభ్యర్థులు తుది ఫ‌లితంపై క్షణ‌మొక యుగంలా గ‌డుపుతూ కౌంటింగ్ స‌మ‌యానికి ఎదురు చూస్తున్నారు. భ‌య‌ప‌డాల్సిందేం లేదు.. అనుకుంటూనే.. క్యాడ‌ర్‌కు స‌ర్దిచెప్పుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గుండెల్లో కొండంత భ‌యాన్ని దాచిపెట్టుకుని ధైర్యాన్ని ప్రద‌ర్శిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఐదేళ్ల భ‌విత‌వ్యంపై ఆందోళ‌న‌..!

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బీజేపీ, బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన 36 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. గెలుపోట‌ములు ఈ మూడు పార్టీల అభ్యర్థుల మ‌ధ్యే ఎక్కువ‌గా ఉంది. వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, ప‌ర‌కాల, మానుకోట‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బ‌లంగా ఉండ‌టంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో త్రిముఖ పోటీ క‌నిపిస్తోంది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యనే ప్రధాన పోటీ నెల‌కొని ఉంది. వ‌రంగ‌ల్ తూర్పులో బీజేపీ, బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య తీవ్రమైన పోటీ క‌నిపిస్తోంది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, ప‌ర‌కాల‌లోనూ అదే సీను క‌నిపిస్తోంది. ఎల‌క్షన్ మేనేజ్‌మెంట్‌లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులతో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ నేత‌లు కొంత వెన‌క‌బ‌డ్డార‌నే చెప్పాలి. అయితే రాష్ట్ర వ్యాప్త వేవ్‌, అభ్యర్థిపై ప్రజ‌ల్లో అభిప్రాయాల వంటి కార‌ణాల‌తోనే బీఆర్ ఎస్ అభ్యర్థుల లెక్కలు తారుమారైన‌ట్లుగా తెలుస్తోంది. ప‌డ‌తాయ‌న్న ఓట్లు ప‌డ‌లేద‌న్న స‌మాచారం తెలుస్తుండ‌టంతో బీఆర్ ఎస్ అభ్యర్థుల్లో కొంత క‌ల‌వ‌రం క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో రెండుచోట్ల బీజేపీ అనుహ్యంగా ఓట్ల బ‌లం పెరిగిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఓ కాంగ్రెస్ అభ్యర్థి వైఫ‌ల్యం చెందార‌న్న ప్రచారం జ‌రిగినా.. వాస్తవంలో ఏం ఇవ్వకున్నా.. ప్రజ‌లు ఓట్లు వేసిన‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. వివిధ వ‌ర్గాలు, పార్టీ శ్రేణుల స‌మాచారంతో ఇప్పటికే ఓ అంచ‌నాకు వ‌చ్చిన ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్థులు తుది ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంద‌ని ఎంతో టెన్షన్‌తో వెయిట్ చేస్తున్నారు.

ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌..!

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని పాల‌కుర్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హ‌నుమాండ్ల య‌శ‌స్విని రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఇక్కడ హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి బ‌రిలోకి దిగుతార‌నే చ‌ర్చ జ‌రిగినా.. పౌర‌స‌త్వం వివాదం నేప‌థ్యంలో ఆమెకు అవ‌కాశం ద‌క్కలేదు. ఆమెకు బ‌దులుగా కోడ‌లు య‌శ్వస్వినిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బ‌రిలోకి దింపింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. హోరాహోరీగా రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. డ‌బ్బుల ప‌ట్టివేత‌, రాజ‌కీయ ఆందోళ‌న‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో హై టెన్షన్ వాతావ‌ర‌ణం క‌నిపించింది. పాల‌కుర్తి నుంచి మూడు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన ద‌యాక‌ర్‌రావు నాలుగోసారి ట‌ఫ్ ఫైట్‌ను ఎదుర్కొన్నార‌నే చ‌ర్చజ‌రుగుతోంది.

అలాగే స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప‌ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సింగ‌పురం ఇందిర బ‌రిలో ఉన్నారు. ఇక్కడ కూడా పోటీ ఈ సారి హోరాహోరీగా సాగుతూ వ‌చ్చింది. జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డికి, జ‌న‌గామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మ‌ధ్య త‌గ్గాప‌ర్ ఎన్నిక‌ల పోరు ఉంది. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి, కొండా సురేఖ‌, బీఆర్ ఎస్ అభ్యర్థి న‌న్నపునేని న‌రేంద‌ర్ మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొని ఉంది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్యర్థి రావుప‌ద్మ, కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేంద‌ర్ రెడ్డి, బీఆర్ ఎస్ అభ్యర్థి విన‌య్‌భాస్కర్ మ‌ధ్య త్రిముఖ పోటీ ఉంది. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ ప‌గ‌డాల కాళీ ప్రసాద్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి, బీఆర్ ఎస్ అభ్యర్థి చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మ‌ధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈనేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంద‌న్న ఆస‌క్తి ఉమ్మడి జిల్లా ప్రజ‌ల్లో నెల‌కొని ఉంది.



Next Story

Most Viewed