మంత్రి పొంగులేటికి వీఆర్వో జేఏసీ కీలక విజ్ఞప్తి

by Bhoopathi Nagaiah |
మంత్రి పొంగులేటికి వీఆర్వో జేఏసీ కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో రద్దయిన వీఆర్వోలను ఎలాంటి షరతులు లేకుండా యథావిధిగా సర్దుబాటు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని వీఆర్వో జేఏసీ కోరింది. బుధవారం ఎంపీ మల్లు రవితో కలిసి వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్ రావు, అదనపు సెక్రటరీ పల్లెపాటి నరేష్‌లు మంత్రిని కలిశారు. వీఆర్వోలు ఇతర శాఖల్లో పని చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీఆర్వోలు అన్ని రకాల సర్వీసు ఉద్యోగ భద్రత, మానసిక ఒత్తిడి, సమాజ విలువలు, ఆత్మగౌరవం కోల్పోవడానికి కారణమైన జీఓ 121 ని రద్దు చేయాలని కోరారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రూపకల్పన త్వరలో ముగించాలని, రెవెన్యూ పరిపాలన వేగవంతం చేయాలన్నారు. జనాభా ప్రతిపాదికన రెవెన్యూ శాఖలో క్యాడర్ స్ట్రెంథ్‌ని పెంచి రెవెన్యూ ఉద్యోగుల శ్రమ దోపిడీకి విముక్తి కలగడానికి ఖాళీలను భర్తీ చేయాలని మంత్రిని కోరారు.

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ వ్యవస్థ, వీఆర్వో వ్యవస్థను 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని సంపూర్ణ అమలు జరపడానికి వీఆర్వో వ్యవస్థను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఈ వ్యవస్థను పునరుద్ధరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సీఎం రేవంత్ రెడ్డికి వివరించి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మంత్రి వారికి సమాధానంగా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Advertisement

Next Story