Vijayashanti : ఆ రెండు పార్టీలు ఒక్కటే.. బీజేపీని వీడటంపై సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
Vijayashanti : ఆ రెండు పార్టీలు ఒక్కటే.. బీజేపీని వీడటంపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క ఈటల రాజేందర్ అని ఈటలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆయన నాటిన మొక్క బీజేపీలో గందరగోళం సృష్టించి.. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని హైకమాండ్ చుట్టూ తిరిగి పదే పదే చెప్పడంతో బీజేపీ అధిష్టానం సైతం బండి సంజయ్‌ని మార్చివేసిందని ఆరోపించారు. బీజేపీ చేజేతులా వారి పార్టీని వారే నాశనం చేసుకున్నారని.. కేసీఆర్ ట్రాప్‌లో బీజేపీ హైకమాండ్ పడిపోయిందన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన విజయశాంతి.. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని చెప్పడంతోనే గతంలో తాను బీజేపీలో చేరాననన్నారు. కానీ అక్కడ తెర ముందు ఒకటి తెర వెనుక మరొకటి జరుగుతున్నదని, కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి గురించి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి నేతలే ప్రశ్నిస్తున్నారు. కానీ అధికారం చేతిలో ఉంచుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దీనికి మోడీ సమాధానం చెప్పాలన్నారు.

శత్రువుతో చేతులు కలిపితే ఎలా?:

కొంత మంది లీడర్లు తన గురించి అసభ్యంగా మాట్లాడారు.. వారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మా గురువు అద్వానీ విలువైనా రాజకీయాలు నేర్పారు.. కానీ ప్రస్తుత బీజేపీ నేతలకు ఆ విలువలు లేవన్నారు. బీఆర్ఎస్, బీజేపీలే నన్ను మోసం చేశాయి తప్ప నేను ఎవరికీ మోసం చేయలేదన్నారు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కేసీఆర్ కొనుగోలు చేస్తే దానికి అప్పటి పీసీసీ ఉత్తమ్ కుమార్ ఏం చేయగలరన్నారు. బీజేపీలో ఉండి పార్టీలో జరుగుతున్న వాటిని అధిష్టానంతో మాట్లాడానని.. కానీ మోడీ బీజేపీని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని ఆరోపించారు.

ఎన్నికలకు నాలుగు నెలల ముందు బండి సంజయ్‌ని మార్చవద్దని అధిష్టానానికి చెప్పినా వినలేదని.. ఏ శత్రువుతో పారాడుతున్నామో అదే శత్రువుతో చేతులు కలిపితే పార్టీలో ఎలా ఉండగలమని ప్రశ్నించారు. చివరి నిమిషం వరకు కేసీఆర్‌పై యాక్షన్ తీసుకుంటారని భావించానని.. కానీ బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటి కావటంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనన్నారు. రాబోయే ఎన్నిక్లలో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పి కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నారన్నారు. కాంగ్రెస్‌లో చేరడం పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Next Story

Most Viewed