- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖ కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా సొంత విద్యుత్ వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని సూచించారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ భూములు, కాలువలపై సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు భారీ స్థాయిలో విద్యుత్ వ్యయం జరుగుతున్నదని.. దీర్ఘకాలికంగా వ్యయాన్ని తగ్గించడంతోపాటు పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించేందుకు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను విస్తృతంగా పరిశీలించాలని సూచించారు.
ప్రతిపాదనలు వెంటనే రెడీ కావాలి..
ప్రతిపాదనల రూపకల్పన కోసం శాఖలోని సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవడంతోపాటు అవసరమైతే బయటి నుండి సైతం నిపుణ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే శాఖ వద్ద అందుబాటులో ఉన్న అధ్యయనాలు, ప్రజెంటేషన్లను వినియోగించి ఆలస్యం లేకుండా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటిపారుదల భూమిపై సౌర విద్యుత్ ప్రాజెక్టులే మొదటి ప్రాధాన్యమని.. ఇతర ఆదాయ వనరులపై తర్వాత దృష్టి పెట్టాలని అన్నారు. అధికారుల ప్రజెంటేషన్ ప్రకారం రాష్ట్రంలోని సుమారు 16 జలాశయాల వద్ద అధ్యయనాలు నిర్వహించారు. అనుకూలమైన జలాశయాలు, నీటిపారుదల భూముల్లో కేవలం 10 శాతం విస్తీర్ణాన్ని మాత్రమే వినియోగించినా దాదాపు 6,000 నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించే అవకాశం ఉన్నదని వారు వెల్లడించారు. దాంతో ఈ ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సంబంధిత చీఫ్ ఇంజినీర్లు, నోడల్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
మంజీరా, సింగూరు వంటి జలాశయాల్లో తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్) ప్రాజెక్టుల అవకాశాలనూ పరిశీలించాలన్నారు. ఇదే సమావేశంలో కాలువలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ నమూనా ప్రాజెక్టును అధికారులు వివరించారు. జాగోరా-చందోరా మధ్య సుమారు 15 కిలోమీటర్ల కాలువపై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ పెట్టుబడి లేదా భూసేకరణ అవసరం ఉండదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడి, ఏటా సుమారు 340 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. ఇందులో ప్రాజెక్టు అవసరాలకు సుమారు 84 లక్షల యూనిట్లు వినియోగించుకుని, మిగిలిన 255 లక్షల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఏటా సుమారు రూ.11.5 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నదని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఏటా రూ.6.2 కోట్ల వరకు ఆదా అవుతుందని, 25 ఏళ్లలో ఇది సుమారు రూ.155 కోట్ల పొదుపునకు దారి తీస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లి నీటిపారుదల రంగాన్ని పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి ఆదర్శంగా నిలిపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.






