'పీహెచ్ఎం, ఆరోగ్యమిత్రల వేతనాలు పెంచాలి'

by Disha Web |
పీహెచ్ఎం, ఆరోగ్యమిత్రల వేతనాలు పెంచాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీహెచ్ఎం, ఆరోగ్యమిత్రల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్, అధ్యక్షుడు ఎండీ, ఫసీయుద్దీన్, ప్రధాన కార్యదర్శి యాద నాయక్, కార్యదర్శి విజయవర్ధన్‌ రాజు, అరోగ్యమిత్రల అధ్యక్షుడు గిరి యాదయ్య, పీహెచ్ఎం వైకుంఠం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్‌హెచ్ఎం ద్వారా వేతనాలు పెంచారని, కానీ ఈ యూవీహెచ్సీలలో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ మేనేజర్‌కు నేటి వరకు వేతనాలు పెరగలేదని తెలిపారు. ఆర్జీపి 2022-23 లో వీరి వేతనం అప్రూవల్ అయ్యి దాదాపు నాలుగు నెలలు అవుతున్నా.. పెంచకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. గతంలో 510 జీఓలో కూడా వేతనాలు పెరగలేదని పేర్కొన్నారు. 1,400 మంది ఆరోగ్యమిత్రలు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని తెలిపారు.

వీరి వేతనాలు రూ.28,000 లకు పెంచాలని, వీరందరినీ తిరిగి పీహెచ్‌సీల్లోకి మార్చాలని, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని, ఆరు గంటల పని విధానం, ప్రమోషన్లు, మరణించిన ఉద్యోగికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా లాంటివి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 సర్వీసులలో పనిచేసిన సిబ్బందిని వాహనాలు నిలుపుదల చేసి పీహెచ్సీల్లో పని చేయిస్తున్నారని తెలిపారు.

వీరూ 33 జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్నారని, కుటుంబాలకు దూరంగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సొంత జిల్లాలకు బదిలీలు చేయాలని అనేకసార్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే వీరందరినీ బదిలీలు చేపట్టి స్వంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు, కమీషనర్ శ్వేతా మహంతి లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story