KCR ఒక పచ్చి మోసగాడు.. కేంద్ర సహాయమంత్రి సాధ్వి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
KCR ఒక పచ్చి మోసగాడు.. కేంద్ర సహాయమంత్రి సాధ్వి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'ఇక్కడ దేశాన్ని ముక్కలు చేసే నాయకుడు ఉన్నాడు.. ఈ విషయం చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.. దేశాన్ని ముక్కలు చేసే వ్యక్తి ఒవైసీకి సోదరుడు' అని కేసీఆర్‌పై పరోక్షంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మండిపడ్డారు. 'కేసీఆర్.. ఏం చెప్పాడు.. ఏం హామిలిచ్చాడు.. పేదలకు ఇండ్లు ఇచ్చాడా? కేసీఆర్ ఒక పచ్చి మోసగాడు.. అలాంటి సీఎంపై ఎలాంటి భాషను ప్రయోగించాలో మీరే చెప్పండి.. పేదలకు కేంద్రం అందించే రేషన్‌ను అడ్డుకున్న ప్రభుత్వం కేసీఆర్‌ది.. ఆ డబ్బులన్నీ కేసీఆర్ తిన్నాడు.. దోచుకున్నాడు.. ఇంకెంత దోచుకుంటావ్.. ఇంకెన్ని తింటావ్.. ప్రభుత్వం ఉన్నది నీ కుటుంబం బాగు కోసమా? ప్రజల బాగు కోసమా?.. గ్రామపంచాయతీలకు డబ్బులు వెళ్లకుండా అడ్డుకుని వాటిని కూడా తింటున్నాడు' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజాసంగ్రామయాత్ర 4వ విడత ముగింపు బహిరంగసభను పెద్ద అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సభకు కేంద్రమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని కేసీఆర్‌పై, పరోక్షంగా ఓవైసీపై నిప్పులు నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రయాగ్ రాజ్‌ను చూస్తున్నానని, 10 ఏండ్ల ముందు భారీ హిందు సమ్మేళనం నిర్వహించగా, అప్పుడు హైదరాబాద్‌కు వచ్చి రంగారెడ్డి జిల్లాలో బస చేసానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదన్నారు.

టెర్రరిస్టులు, ఉగ్రవాదులకు ఇబ్బంది కలిగిందంటే చాలు బాధపడే వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసునని ఒవైసీపై పరోక్ష విమర్శలు చేశారు. బీజేపీ, ఆపార్టీ నేతలు ముస్లింలకు విరోధులు కాదు.. మేము వారిని ఎన్నడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అలా వ్యతిరేకించి ఉంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యేవారా అన్నారు. కానీ కేసీఆర్.. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకి అని, ద్రౌపది ముర్మ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే కనీసం సపోర్ట్ చేయని వ్యక్తి అని మండిపడ్డారు. ఆదివాసీల వ్యతిరేకి కేసీఆర్ అని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆ యాత్ర తెలంగాణకు కూడా వస్తోందని, అది భారత్ జోడో యాత్ర కాదు.. భారత్ చోడో యాత్ర.. ఇదే వారికి చివరి యాత్ర.. వారు ఎలాగూ గెలిచేది లేదని స్పష్టం చేశారు. అన్నా హజారే చేసిన ఆందోళనల నుంచి వచ్చిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు.. కానీ ఆ పార్టీకి చెందిన మంత్రి ఎందుకు జైలుకు వెళ్ళాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవంను ఎంఐఎంకు భయపడే.. 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే.. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' జరిపిందని వెల్లడించారు. మన దేవుళ్లను, దేవతలను కించపరిస్తే.. మనం ఓర్చుకోగలమా? అని ప్రశ్నించారు.

ప్రజలను తెలంగాణ ప్రభుత్వం దోచుకుందని మండిపడ్డారు. యూపీలో ప్రజలను దోచుకున్న నేతల ఇండ్లపైకి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు ప్రయోగించారన్నారు. కేసీఆర్, రాహుల్ గాంధీ, బెంగాల్, బీహార్, బీజేపీయేతర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని వారి కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. 2014కు ముందు హైదరాబాద్‌లో ప్రజలకు భద్రత ఎక్కడిది? ఎక్కడ ఎలాంటి బాంబు దాడులు జరుగుతాయో తెలియపరిస్థితి అని, మోడీ అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఉగ్ర దాడులు జరిగాయా? మీకు ఇలాంటి ప్రభుత్వం కావాలా? అవినీతిపరుల ప్రభుత్వం కావాలా? అని ప్రజలను అడిగారు.

గతంలో ఉత్తర్ ప్రదేశ్‌లో 77 సీట్లు ఉంటే.. అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అన్నారు. రామ భక్తులు జైలుకు వెళ్ళారు.. వాళ్ళు త్వరలోనే బయటికి వస్తారని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లే వారు ఎవరూ.. తప్పు చేసినట్లు కాదు అని, నేను కూడా జైలుకు వెళ్ళాను.. కానీ తప్పు చేయలేదు.. రామ మందిరం కోసం ఆందోళన చేసి వెళ్ళానన్నారు. నిజంగా తప్పు చేసిన వారు జైలుకు వెళ్లే సమయం వచ్చిందని జోస్యం చెప్పారు. కశ్మీర్‌కు తగిలిన గాయాలను ఎవరూ మర్చిపోలేదన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇకనుంచి ఇక్కడికి తరచూ రాష్ట్రానికి వస్తూంటానని స్పష్టం చేశారు.


Next Story