రూ.3110 కోట్ల ‘కంపా’ నిధులిచ్చాం: కేంద్రమంత్రి

by GSrikanth |
రూ.3110 కోట్ల ‘కంపా’ నిధులిచ్చాం: కేంద్రమంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కంపా నిధుల కింద రూ.3110 కోట్లు కేటాయించిందని, కానీ వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయంగా పెంచాలని భావించి కంపా నిధులను అందిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. కంపా నిధుల కింద మొత్తం రూ.3110 కోట్లు బడ్జెట్ కేటాయించగా.. 2019-20 సంవత్సరానికి గాను రూ.501.26 కోట్లు, 2020-21 కిగాను రూ.483.78 కోట్లు, 2021-22 నాటికి తెలంగాణకు మొత్తం రూ.1737.75 కోట్లను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందులో రూ.1127.93 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. అంటే దాదాపు రూ.609.82 కోట్లు వినియోగించలేదని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళికల లక్ష్యాలను చేరుకోవడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. దీని ప్రభావం వన్యప్రాణులపై పడుతోందని, తద్వారా తెలంగాణలో పులుల సంఖ్య తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం, పార్కులు, జంతుప్రదర్శన శాలల నిర్వహణ కోసం కేటాయించిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోవడం లేదని లేఖలో ఫైరయ్యారు.

రాష్ట్రాభివృద్ధికి సహకరించాలనే లేఖలు

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహకారాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. తెలంగాణ అభివృద్ధికోసం ఏదైనా చేయాలనే ధ్యాసే లేదని కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. కేసీఆర్ కు ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ధ్యాసే లేదని ఫైరయ్యారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే.. కలిసే తీరిక లేని సీఎం, మహారాష్ట్రలో మీటింగులు పెడుతున్నారన్నారు.

ఈనెల 20, 21న గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్

బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న దేశాలతో సాంస్కృతిక, దౌత్య సంబంధాల బలోపేతానికి ‘గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్-2023’ను నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతాన్ని ఆచరించే ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, అంబాసిడర్లు పాల్గొననున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

Next Story

Most Viewed