369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ కాదా..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ కాదా..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ స్వలాభం లేకుండా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. 1200 మంది ఆత్మబలిదానం చేసుకున్నాక గానీ.. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు కిషన్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్.. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి మద్దతు తెలిపాల్సింది పోయి.. రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, మజ్లిస్ పార్టీలతో జతకట్టారని ఆయన విమర్శలు చేశారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మందిని కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్ కాదా? అని లేఖలో ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు అండగా ఉండాలన్న సుష్మాస్వరాజ్ నిర్ణయం, పార్లమెంటు లోపల, బయట బీజేపీ చేసిన ఉద్యమం, తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల బలిదానానికి తలొగ్గి కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిందని, ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యం కాంగ్రెస్ నేతలకుందా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోని కాంగ్రెస్.. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీకి పిలిపించుకొని ఆశీర్వచనాలిచ్చి, ఫొటోలకు పోజులు ఇవ్వడం వెనక జరిగిన వాస్తవ కథనాలకు వాస్తవరూపం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. తెరముందు రాజకీయంగా వైరుధ్యాన్ని పాటిస్తూనే.. తెరవెనుక కలిసి పనిచేయాలనే దోస్తీ బట్టబయలైందని లేఖలో ప్రస్తావించారు.

అందుకే 2014, 2018ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినా.. వారిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విభజన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడిలా అలాగే ఉన్నాయని, దీనికి కారణం.. కాంగ్రెస్ స్వార్థ బుద్ధి, రాజకీయ కుట్ర అని స్పష్టంగా అర్థమవుతూనే ఉందని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిచేందుకు కేసీఆర్ డబ్బు పంపించారంటూ అనేక ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడానికి కూడా కేసీఆర్ ఆర్థికసాయం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారని లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను, సొంత రాష్ట్రంలో బతుకులు బాగుపడతాయనుకున్న ప్రజల ఆశలను కాలరాసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ, అవినీతి పార్టీలకు తెలగాణ ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed