నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరుగుతున్న గ్రూప్ కొలువులు

by Disha Web Desk 2 |
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరుగుతున్న గ్రూప్ కొలువులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఖాళీలు మరింత పెరుగనున్నాయి. గ్రూప్, 2, 3, 4 పరిధిలోకి వచ్చే పోస్టులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి కొత్త జీవో నె.136 జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో నెం.55ను సవరిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న మరిన్ని పోస్టులను గ్రూప్ 2, 3, 4 సర్వీసుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకే తీరుగా ఉండటంతో ఈ మార్పులు చేసింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.

గ్రూప్-2లో చేర్చిన పోస్టులు

ఈ సవరణ జీవో ప్రకారం.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా గ్రూప్-2 పోస్టుల పరిధిలో చేర్చారు.

గ్రూప్-3లో చేర్చిన పోస్టులు

ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ విభాగంలోని అకౌంటెంట్ పోస్టు, వివిధ విభాగాల్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్/ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ పోస్టులను గ్రూప్ 3 పరిధిలో చేర్చారు.

గ్రూప్-4లో చేర్చిన పోస్టులు

జిల్లా విభాగాల పరిధిలోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, సూపర్వైజర్ (మేల్), మాట్రన్ కమ్ స్టోర్ కీపర్, మాట్రన్ పోస్టులను గ్రూప్ 4 సర్వీసుల పరిధిలోకి చేర్చారు.

దీంతో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది. టీఎస్పీఎస్సీ ప్రతిపాదించిన మేరకు ఈ పోస్టులను సవరించినట్లు, తదనుగుణంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్‌కు తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఈ జీవో జారీ చేశారు.



Next Story

Most Viewed