కేంద్రంపై యుద్ధం.. నేడే టీఆర్‌ఎస్ నిరసన దీక్షలు

by Disha Web Desk 4 |
కేంద్రంపై యుద్ధం.. నేడే టీఆర్‌ఎస్ నిరసన దీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఉద్యమబాట నేటి నుంచి ప్రారంభమవుతోంది. కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనుంది. నియోజక కేంద్రాల్లో ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొననుండగా.. ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సైతం మండల కేంద్రాల్లో జరిగే నిరసనల్లో పాల్గొననున్నారు. జిల్లా మంత్రులు పర్యవేక్షణ చేయనున్నారు. కేంద్రం రారైస్ తీసుకుంటామని బాయిల్డ్ రైస్ తీసుకోబోమని పార్లమెంట్ మెంట్ తో పాటు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా టీఆర్ఎస్ ఎంపీలకు తేల్చి చెప్పారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించాలని భావించి నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగించనున్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో పాటు రైతులు పాల్గొనేలా కార్యచరణ చేపట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననుండగా, కొన్ని మండలాల్లో ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొననున్నారు. అయితే అన్ని మండలాల్లో విజయవంతం బాధ్యత పర్యవేక్షణను సంబంధిత జిల్లా మంత్రులు చేయనున్నారు. ఢిల్లీకి నిరసన తాకేలా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. మండల కేంద్రంలో ధర్నాలను విజయవంతం చేసి పార్టీ దృష్టిలో పడేందుకు కింది స్థాయి నేతలు అన్ని చర్యలు చేపడుతున్నారు.

నేతలతో టెలీ కాన్ఫరెన్స్...

మండల కేంద్రంలో జరిగే నిరసన ధర్నాను విజయవంతం చేసేందుకు ఆయా జిల్లాల మంత్రులు పార్టీ శ్రేణులతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల కేంద్రాలలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలను పార్టీ నేతలు రైతాంగం ప్రజల సమన్వయంతో సక్సెస్ చేయాలని ఆదేశించారు. ఇందుకు మండలాల వారీగా పార్టీ సీనియర్ నాయకులను, ప్రజాప్రతినిధులను ఇన్చార్జిలుగా నియమించి వారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలను రైతులను భాగస్వామ్యం చేస్తూ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉండేటట్టుగా చూడాలన్నారు. ధర్నా అనంతరం మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతుల అందరికీ చేరే విధంగా గతంలో బీజేపీ నేతలు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను చూపించాలని సూచించారు. ఎండాకాలం అయినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం పట్ల కేంద్ర వైఖరి, యాసంగి ధాన్యం కొనుగోలు పై మొoడి వైఖరి, బియ్యం కొనుగోలు పై కేంద్రం వివక్ష ప్రజలకు తెలియాలన్నారు. మన గల్లీ లకు ఢిల్లీ దిగి వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు.



Next Story

Most Viewed