'పార్లమెంట్‌ సభ్యుడిగా కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పు'

by Disha Web Desk 2 |
పార్లమెంట్‌ సభ్యుడిగా కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పు
X

దిశ, తిమ్మాపూర్: రాష్ట్ర సాంస్కృతిక సారథి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నాన్ లోకల్ కాదని, తెలంగాణ రాష్ట్రానికే లోకల్ నాయకుడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు అన్నారు. సోమవారం మానకొండూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే రసమయిపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఎమ్మెల్యే రసమయి స్థానికేతరుడు కాదని వచ్చే ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం నుండి తరిమి కొడతామని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా రసమయి చేసిన కృషికి మానకొండూరు నియోజకవర్గ రెండుసార్లు అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షురాలు సోనియా గాంధీ అసలు మనదేశం మహిళనే కాదు అనే విషయాన్ని మరచి రసమయి స్థానికేతరుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికే లోకల్ నాయకుడు రసమయి అనే విషయాన్ని గమనించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంలో రైతులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకనే టీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, ఇక అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై బండి సంజయ్ చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు బలైన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి దేశ సంపదను గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తే నోరు మెదపని బండి సంజయ్ రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ రాష్ట్రానికి వెళితే ఎందుకంత కడుపుమంట అని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనపై బండి సంజయ్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి కల్పించడానికి విదేశీ కంపెనీల పెట్టుబడుల కోసం నిరంతరంగా పర్యటన చేస్తున్నారని తెలిపారు. ఒక చదువు రాని దద్దమ్మ బండి సంజయ్ అని, అందుకే పక్క రాష్ట్రాల వారితో పాటు విదేశాలలోని తెలుగు వారు కూడా బండి సంజయ్‌ని ఆహ్వానించడం లేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదాను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. మైక్ దొరికితే కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు చేయడం తప్ప, ఒక ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో తెలపాలన్నారు. ఇకమీదట టీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.



Next Story