పెండింగ్ డీఏలు విడుదల చేయండి.. ప్రభుత్వంపై టీపీటీఎఫ్ ఆగ్రహం

by Dishafeatures2 |
పెండింగ్ డీఏలు విడుదల చేయండి..  ప్రభుత్వంపై టీపీటీఎఫ్ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులను ట్రెజరీల్లో ఆమోదించి, ఈ కుబేర్‌లో నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం సరికాదని, వాటిని వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ కుమార్, ముత్యాల రవీందర్ గురువారం రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. పీఆర్సీ బకాయిలు 12 నెలలకు బిల్లులు చేస్తే కేవలం 3 నెలలు చెల్లించి 9 నెలలవి పెండింగ్ లో ఉంచారని, నెలల తరబడి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిపిట్స్‌, జీపీఎఫ్‌, సరెండర్ లీవ్, టీఎస్ జీఎల్ఐ, సెలవు వేతనాలు వంటి బిల్లులన్నీ ట్రెజరీల్లో పాస్ చేసినా ఉపాధ్యాయుల ఖాతాల్లో మాత్రం జమకావడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

గతేడాది కూడా ఇలాగే ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా నగదు విడుదల కాకపోవడం వల్ల అనేక బిల్లులు అలాగే ఉండిపోయాయని, ఆ బిల్లులను రీవ్యాలిడేట్‌ చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి రాకుండా ఈ కుబేర్ లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.



Next Story

Most Viewed