పేపర్ లీకేజీల ప్రభుత్వంపై పోరాటం షురూ

by Disha Web Desk 16 |
పేపర్ లీకేజీల ప్రభుత్వంపై పోరాటం షురూ
X
  • ఎన్నికేసులు పెట్టిన వెనుకాడేది లేదు
  • ఈనెల 18న ‘నిరుద్యోగుల గోశ-అఖిలపక్ష పార్టీల భరోసా’ నిరసన దీక్ష
  • - టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పోరాట కమిటీ

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసే దాకా, అసలైన పేపర్‌ లీకేజీల నిందితులను పట్టుకునేదాకా ప్రభుత్వంపై పోరాటం ఆపమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి హెచ్చరించారు. అందులో భాగంగానే అఖిలపక్షాలు కలిసి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ పోరాట కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో అఖిలపార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వ పొరపాట్లపై ప్రతి పక్షాలు పోరాటం చేస్తుంటే వారి గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకులు అయినట్లు సిట్ చెప్పిందని, దీంతో 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. లీకేజీ విచారణ సిట్‌తో కాకుండా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం జరిగే దాకా అరెస్టులు చేసిన పోరాటం మాత్రం ఆపేది లేదని మల్లు రవి హెచ్చరించారు.

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీ తీవ్రమైన సమస్య అని, గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. లీకేజీలపై సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందించలేదన్నారు. బాధ్యత గల చైర్మన్ లీకేజీని పసిగట్టలేక పోయారని మండిపడ్డారు. లీకేజీలపై నిరసనగా ఈ నెల 18 న ‘నిరుద్యోగుల గోస-అఖిలపక్ష పార్టీల భరోసా’ ఇందిరాపార్క్ వద్ద దర్నా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల గోసపై అఖిలపక్షమే భరోసా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రద్దయిన పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్తులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రపతికి, సీఎంకు, గవర్నర్‌కు లేఖలు రాయబోతున్నట్లు పేర్కొన్నారు. పోరాటంలో భాగంగా యూనివర్సిటీలు, లైబ్రరీలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు కేంద్రంగా జరగుతాయని వివరించారు.

బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల రోజుల నుంచి రకరకాల కుట్రలు జరుగుతున్నాయని, పేపర్ లీకేజీ విషయంలో కమిషన్ సభ్యులను పోలీసులు టచ్ చేయలేదని ఆరోపించారు. పదో తరగతి పేపర్ లీక్ కంటే పెద్ద కుట్ర టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీజేఎస్ నేతలు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, నిజ్జన రమేష్ ముదిరాజ్, బైరి రమేష్, సీపీఐఎంల్ నేతలు రమ, చలపతిరావు, గోవర్ధన్, ప్రొఫెసర్ రియాజ్, అఖిలపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story