కేసీఆర్ ఉడత ఊపులను ప్రజలు నమ్మరు : బెల్లయ్య నాయక్

by Disha Web |
కేసీఆర్ ఉడత ఊపులను ప్రజలు నమ్మరు : బెల్లయ్య నాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఉడుత ఊపులు ఇకపై ప్రజలు నమ్మరని టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలకు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ పాలన పై లేదని విమర్శించారు. రైతు డిక్లరేషన్‌తో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. ఈ రోజుకి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాని దుస్థితి తెలంగాణలో వుందన్నారు. గ్రాడ్యుయెట్ ఓటర్లతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారని, గ్రాడ్యుయెట్‌ల కోసం ఎప్పుడైన ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు రాజులా బతుకుతున్నారని అన్నారు. టీపీసీసీ దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఒక దళిత, పేద శ్రీను అనే యువకుడిని పోలీసులు చిత్ర హింసలు పెట్టి వేధించారని ఆరోపించారు.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ‌లు దళితులపైన చేసే హింసలు విషయంలో కలిసి పని చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఫ్లెక్సీ చినిగిందని ఒక నాయకుడు ఫిర్యాదు చేశారని, దీంతో దళిత పేద యువకుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో 2 రోజులు చిత్ర హింసలు పెట్టారని అన్నారు. కేశవ్ పేట పోలీస్ స్టేషన్‌లో 10, 11 తేదీలలో యువకుడిని ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా విచారణ చేసి కొట్టారని ఆరోపించారు. కేశవ్‌పేట సీఐ మీద తాము ఫిర్యాదు చేస్తే ఆయనపై కేసు పెట్టకుండా తిరిగి మళ్ళీ బాధితుడు పైనే కేసు నమోదు చేశారని అన్నారు. బాధిత కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం రెండు రోజుల్లో ఇవ్వాలని, పోలీస్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దళిత బంధు అని పేరు చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ నాయకులకు వంత పడుతుందన్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోకపోతే సీపీ కార్యాలయం ముందు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కారణాలు తెలుసుకునే ఆలోచన చేయడం లేదని అన్నారు. చనిపోయినవారికి రైతుభీమా ద్వారా డబ్బులు ఇవ్వడం కాదని, చనిపోకుండా చూసుకునే సోయి ప్రభుత్వం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై చర్చించడానికి ఎక్కడ చర్చ పెట్టిన తాను సిద్ధమని టీఆర్ఎస్‌కు సవాల్ చేశారు.

Next Story