డేటా వినియోగంలో టాప్ 2.. మోగుతున్న డేంజర్ బెల్స్

by Disha Web Desk 4 |
డేటా వినియోగంలో టాప్ 2.. మోగుతున్న డేంజర్ బెల్స్
X

దిశ, వెబ్ డెస్క్: మొబైల్ మన దేహంలో ఓ అవయవంలా మారింది. ప్రతి విషయాన్ని మన కళ్ల ముందు సెకన్లలో ఉంచుతోంది. డిజిటల్ చెల్లింపుల నుంచి సమాచారం వరకు అందరూ మొబైల్ పైనే ఆధారపడుతున్నారు. మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. నెలకు సగటున ప్రతి భారతీయుడు 12 జీబీ డేటాను వాడుతున్నట్లు తాజా సర్వేలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగం భారత్ వాటా 21 శాతంగా ఉంది. ఇటీవలే దేశంలో ప్రధాని మోడీ 5 జీ సేవలను ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గడం, తక్కువ ధరలో డాటా ప్యాక్ లతో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కాగా మొబైల్ డాటా విషయంలో దూసుకెళ్తున్న మనకు కొన్ని అత్యంత ప్రమాదకర సవాళ్లు ఎదురువుతున్నాయి.

అందుబాటులోకి కీలక సేవలు..

మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఆన్ లైన్ లో టికెట్లు, రుసుముల చెల్లింపు, ఓలా, ఉబెర్ వంటి వాటిని వినియోగించుకోవడం జరుగుతున్నాయి. విద్య, విజ్ఞాన, వినోదరంగాల్లో స్మార్ట్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్డర్ పై వస్తువులు, కూరగాయాలు, మెడిసిన్స్ పొందే వీలు యాప్ ల వినియోగం ద్వారా మనకు కలిగింది. మొబైల్ లోనే సినిమాలు చూసేందుకు ఓటీటీ ప్లాట్ ఫాం శరవేగంగా దూసుకొచ్చింది. మొబైల్ సాంకేతికతను వినియోగించుకుని పోలీసులు అనేక కేసులను చేధిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులతో పౌరులకు త్వరితగతిన సేవలు అందుతున్నాయి. ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. మొబైల్, డాటా వినియోగంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి.

అశ్లీల వీడియోలు.. గ్యాంగ్ రేప్

ఇటీవల హైదరాబాద్ హయత్ నగర్ లో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన అనంతరం పోలీసులు జరిపిన విచారణలో నిందితులైన మైనర్ బాలురు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసి గ్యాంగ్ రేప్ చేశామని తెలపడం కలవరం రేకెత్తించే అంశం. ఇటీవల యూపీలోని మీరఠ్ లో 12 వతరగతి విద్యార్థులు మహిళా ఉపాధ్యాయురాలికి ఐ లవ్ యూ చెప్పి వేధించి మొబైల్‌లో వీడియో తీసి వైరల్ చేయగా ఘటన కలకలం రేపింది. బాల్యంలోనే విద్యార్థుల చేతికి మొబైల్ అందడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. డేటా వినియోగం, సాంకేతికత పెరుగుతున్నా ఇలాంటి ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా కాలంలో చాలా మంది విద్యార్థులు మొబైల్ ఫోన్లలోనే ఆన్ లైన్ క్లాస్ లకు అటెండ్ అయ్యారు. అనంతరం మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో విసృంఖలంగా అడల్డ్ కంటెంట్ ప్రసారం కావడం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొబైల్ వినియోగిస్తున్న చిన్నారుల్లో కంటి చూపు మందగించడం, మెడ నొప్పి వంటివి తరచూ చోటుచేసుకుంటున్నాయి.

పసిప్రాయంలోనే మొబైల్ గేమ్‌లకు చిన్నారులు బానిసలవుతున్నారు. మందలిస్తే తల్లిదండ్రులని కూడా చూడకుండా హత్యలకు పాల్పడటం, లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇక యువత ప్రధానంగా బెట్టింగ్ వైపు మళ్లడానికి కూడా మొబైల్ కారణమవుతోంది. అంతా యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా బెట్టింగ్ చేతుల్లోనే అందుబాటులో ఉంటోంది. బెట్టింగ్‌లు కాస్తూ జీవితాలను యువత పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఫోన్లు చూసే చిన్నారులకు అసభ్యకర ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీంతో పిల్లలు పసి ప్రాయంలోనే పెడదోవ పడుతున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా అందుతున్న రుణాలు సైతం చాలా మంది జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. సాంకేతికతను వినియోగించుకుని దూసుకెళ్తున్న మన దేశంలో ఇలాంటి వాటిపై నియంత్రణ ఆవశ్యకమని నిపుణులు అంటున్నారు.


Next Story

Most Viewed