రాహుల్‌పై వేటుతో తెలుగు రాష్ట్రాల నేతలు మారేనా?

by Disha Web Desk 2 |
రాహుల్‌పై వేటుతో తెలుగు రాష్ట్రాల నేతలు మారేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చగా మారింది. ఎప్పుడో 2019 నాటి కేసులో ఆయనపై కోర్టు జైలు శిక్ష విధించడం.. కోర్టు తీర్పుతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం లోక్ సభ ఆయనపై అనర్హత వేటు వేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీపై చర్యలు ఇతర ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలాంటిది అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతల భాష చర్చకు వస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని నేతలు భాష శృతిమించుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా విమర్శలు చేసుకోవాల్సిన నేతలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం, అసభ్యకర పదాలతో పరస్పరం దూషించుకోవడం పరిపాటిగా మారింది.

అసందర్భంగా రాజకీయ విమర్శల్లోకి కుటుంబ సభ్యులను లాగడం వంటి ఎత్తుగడలు నిత్యకృత్యంగా మారాయి. కొంత మంది నేతల మాటలు వింటే ప్రజలు 'ఛీ' అనేంతలా దిగజారి ఉంటున్నాయి. అలాంటి వారిలో కొందరి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వర్గాల మధ్య చిచ్చు పెట్టేవిగా కూడా ఉంటున్నాయి. అయితే లైన్ క్రాస్ చేస్తున్న తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో పార్టీలు విఫలం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేతలకు రాహుల్ గాంధీ విషయంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిదనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీపై వేటుతోనైనా నేతలు తమ తీరు మార్చుకుంటారా లేక పాతపంధానే అవలంభిస్తారా అనేది కాలమే నిర్ణయించనుంది.

Next Story